US visa: యుఎస్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? రికార్డు స్థాయిలో మరో 250,000 వీసా అపాయింట్‌మెంట్‌లు
అమెరికా వెళ్లాలని భావిస్తున్న భారతీయులకు మరో అవకాశం లభించింది. అగ్రరాజ్యం అదనంగా 2.5 లక్షల వీసా అపాయింట్‌మెంట్లను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఈ అవకాశాలు పర్యటకులు, నైపుణ్యాలు కలిగిన కార్మికులు, విద్యార్థులకు ఉపయోగపడతాయని తెలిపింది. ఈ విషయాన్ని అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ కొత్త స్లాట్‌ల విడుదల వల్ల వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులు సమయానికి ఇంటర్వ్యూలు పొందడానికి సాయపడుతుందని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. అంతేకాకుండా, అమెరికా-భారత్ సంబంధాలను మరింత బలపరచడంలో ఈ చర్య ప్రభావవంతమని అభిప్రాయపడింది.
భారీ సంఖ్యలో విద్యార్థి వీసాలు
వరుసగా రెండవ ఏడాది పది లక్షలకు పైగా నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా అపాయింట్‌మెంట్లను నిర్వహించినట్లు యూఎస్ ఎంబసీ తెలిపింది. ప్రస్తుతం ప్రధానంగా కుటుంబీకులు, వ్యాపారులు, పర్యటకులపై దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, గత ఏడాదిలానే ఈసారి కూడా భారీ సంఖ్యలో విద్యార్థి వీసాలు జారీ చేసినట్లు అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది. ఇది వరుసగా నాలుగోసారి విద్యార్థి వీసాలు అధిక సంఖ్యలో జారీ అవడం గమనార్హం. అయితే, ఇప్పటివరకు ఎన్ని వీసాలు జారీ చేశారన్న వివరాలు ఇంకా ఇవ్వలేదు. 2023లో మాత్రం 1.4 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసినట్లు పేర్కొంది.