Pm Modi: 'శాంతియుత' పరిష్కారానికి భారతదేశం మద్దతు.. జెలెన్‌స్కీతో భేటీ అయిన మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా పర్యటనలో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారతదేశం పూర్తి మద్దతును మోదీ పునరుద్ఘాటించారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో, జెలెన్‌స్కీ, మోదీల మధ్య ఇది రెండో భేటీ కావడం గమనార్హం. భేటీ జరిగిన విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ వేదికలో ప్రకటించారు. గత నెలలో ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా, ఆ దేశంలో శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని, శాశ్వతంగా, శాంతియుత పరిష్కారం కోసం అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉందని మోదీ పేర్కొన్నారు.
మోదీ భారత్‌కు తిరుగు ప్రయాణం
జెలెన్‌స్కీ మాట్లాడుతూ,"మేము ఇరుదేశాల మధ్య సంబంధాలను మెరుగుపరుస్తున్నాం. వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ వేదికలపై,ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి,జీ20 సమావేశాల్లో శాంతి సూత్రాన్ని అమలు చేయడంపై చర్చించాము. మన సార్వభౌమాధికారం,ప్రాదేశిక సమగ్రతకు మీరు ఇచ్చిన మద్దతుకు కృతజ్ఞతలు" అన్నారు. గత నెలలో ఉక్రెయిన్ పర్యటన సమయంలోనూ జెలెన్‌స్కీ, మోదీల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చలు జరగగా,ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ మద్దతుగా నిలుస్తుందని మోదీ స్పష్టం చేశారు. ఇదిలావుండగా,ఐరాస సదస్సు అనంతరం మోదీ,జెలెన్‌స్కీతో పాటు ఆర్మేనియా ప్రధాన మంత్రి పాషిన్‌యాన్ వంటి ఇతర నేతలతో కూడా ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు. మూడు రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని,మోదీ మంగళవారం భారత్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు.