LOADING...
Indonesia: ప్రంబనాన్ శివాలయంలో ప్రధాని మోదీ పూజలు.. 'ఓం నమః శివాయ'తో మార్మోగిన ప్రాంగణం 
ప్రంబనాన్ శివాలయంలో ప్రధాని మోదీ పూజలు.. 'ఓం నమః శివాయ'తో మార్మోగిన ప్రాంగణం

Indonesia: ప్రంబనాన్ శివాలయంలో ప్రధాని మోదీ పూజలు.. 'ఓం నమః శివాయ'తో మార్మోగిన ప్రాంగణం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2026
01:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చారిత్రక ప్రంబనాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో కలిసి శివాలయంలో పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడికి వచ్చిన భక్తులతో కలిసి 'ఓం నమః శివాయ' నామస్మరణ చేయగా, ఆలయ ప్రాంగణం శివనామంతో మార్మోగింది. ఈ ఆధ్యాత్మిక అనుభూతికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ తన 'ఎక్స్' ఖాతాలో పంచుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మోదీ చేసిన పోస్ట్ 

వివరాలు 

ప్రంబనాన్ ఆలయ పునరుద్ధరణకు భారత్ సహకారం

ఆలయ సందర్శనకు ముందు ప్రధాని మోదీ, అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో సంయుక్తంగా ప్రంబనాన్ ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ఆలయ సంరక్షణ, పునరుద్ధరణ పనులకు భారత్ ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందించనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మంగళవారం ఇరు దేశాల మధ్య 'లెటర్ ఆఫ్ ఇంటెంట్'పై కీలక ఒప్పందం కుదిరింది. ప్రధాని మోదీ ఆలయానికి చేరుకునే మార్గమంతా స్థానిక ప్రజలు భారత్, ఇండోనేషియా జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ఉన్న స్నేహబంధానికి ప్రతీకగా పలువురు స్థానికులు ఉత్సాహంగా స్వాగత కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Advertisement

వివరాలు 

10వ శతాబ్దపు అద్భుత నిర్మాణం

10వ శతాబ్దంలో నిర్మితమైన ప్రంబనాన్ ఆలయం ఇండోనేషియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయంగా గుర్తింపు పొందింది. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు అంకితమైన ఈ ఆలయ సముదాయం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ సముదాయం మధ్యలో 47 మీటర్లు (154 అడుగులు) ఎత్తైన శివాలయం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆలయ గోడలపై రామాయణ గాథలను ప్రతిబింబించే అద్భుత శిల్పాలు సందర్శకులను ఆకట్టుకుంటాయి. ఒకప్పుడు ఈ ప్రదేశంలో దాదాపు 240 చిన్న, పెద్ద ఆలయాలు ఉండటంతో ప్రపంచంలోని అత్యంత వైభవమైన హిందూ క్షేత్రాల్లో ఒకటిగా ప్రంబనాన్ వెలుగొందింది.

Advertisement

వివరాలు 

భారత్-ఇండోనేషియా బంధానికి చారిత్రక మూలాలు

ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ భారత్-ఇండోనేషియా సంబంధాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. రెండు దేశాల మధ్య కేవలం సముద్ర అనుబంధమే కాకుండా, శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక బంధం కూడా ఉందని పేర్కొన్నారు. "భారత్-ఇండోనేషియా సంబంధాల మూలాలు రామాయణం, మహాభారతం వంటి ఉమ్మడి వారసత్వంలో ఉన్నాయి. బోరోబుదూర్, ప్రంబనాన్ వంటి అద్భుత కట్టడాలు మన సాంస్కృతిక అనుబంధానికి సజీవ నిదర్శనాలు" అని ఇండోనేషియా పార్లమెంటులో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ తెలిపారు. మూడు రోజుల ఇండోనేషియా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోతో ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అలాగే అక్కడి ప్రవాస భారతీయులను కలిసి వారితో ముచ్చటించారు.

Advertisement