Poland vs Zelenskyy: జెలెన్‌స్కీకి షాక్.. అత్యున్నత పురస్కారం రద్దు చేసిన పోలాండ్
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి గతంలో ప్రదానం చేసిన తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని రద్దు చేస్తున్నట్లు పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకీ ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పోలండ్ ప్రజలపై తీవ్ర హింసాత్మక చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ ఇన్‌సర్జెంట్ ఆర్మీ (యూపీఏ) పేరును ఉక్రెయిన్ ఒక సైనిక విభాగానికి కేటాయించడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు.
వివరాలు
ఆ యుద్ధంలో పోలాండ్ పౌరులపై యూపీఏ దాడులు..
ఈ సందర్భంగా నవ్రోకీ మాట్లాడుతూ, రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్ పౌరులపై యూపీఏ అమానుష దాడులు, యుద్ధ నేరాలకు పాల్పడిందని, అలాంటి సంస్థ పేరును సైనిక యూనిట్‌కు పెట్టడాన్ని తమ దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని స్పష్టం చేశారు. 2023లో పోలండ్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగల్'ను జెలెన్‌స్కీకి ప్రదానం చేసింది. అయితే తాజా నిర్ణయంతో ఆ గౌరవాన్ని ఉపసంహరించుకుంది.
వివరాలు
ఈ చర్య వల్ల రష్యాకే రాజకీయంగా లాభం..
పోలండ్ నిర్ణయంపై ఉక్రెయిన్ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ చర్య వల్ల రష్యాకే రాజకీయంగా లాభం చేకూరుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే, జెలెన్‌స్కీకి ఇచ్చిన పురస్కారాన్ని వెనక్కి తీసుకున్నప్పటికీ, రష్యాతో కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు తమ దేశం అందిస్తున్న మద్దతులో ఎలాంటి మార్పు ఉండదని పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రోకీ స్పష్టం చేశారు.