బక్రీద్ వేళ మసీదు ఎదుట ఖురాన్ దహనం చేసేందుకు పోలీసుల అనుమతి
ప్రపంచమంతా బక్రీద్‌ను జరుపుకునేందుకు సిద్ధమైన వేళ స్వీడన్ వివాదాస్పద సంఘటన జరిగింది. ముస్లింలు పవిత్రంగా భావించే ఖురాన్‌ను మసీదు ఎదుట దహనం చేసేందుకు స్వీడన్ పోలీసులు అనుమతి ఇచ్చారు. స్వీడన్‌లో కుర్దిష్ హక్కుల కోసం ఖురాన్‌కు వ్యతిరేకంగా ఇటీవల ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖురాన్‌ను దహనం చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల పలు దరఖాస్తులు రావడంతో పోలీసులు నిరాకరించారు. ఖురాన్‌ను కాల్చివేసే నిరసనలపై పోలీసు నిషేధాన్ని స్వీడన్‌లోని కోర్టు రద్దు చేసింది. దీంతో స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లో ప్రధాన మసీదు ఎదుట ఖురాన్‌ను దహనం చేసేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
స్వీడన్‌కు సవాల్‌గా మారిన నాటో చేరిక
స్వీడన్‌లో మసీదు దహనం ఘటన ఆ దేశం నాటోలో చేరాలన్న ఆశయానికి అవరోధంగా మారుతోంది. ముఖ్యంగా టర్కీ స్వీడన్‌పై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. స్టాక్‌హోమ్‌లోని టర్కీ రాయబార కార్యాలయం సమీపంలో ఖురాన్ ప్రతిని దహం చేయడం ద్వారా టర్కీ, ఇతర ముస్లిం దేశాలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరడానికి స్వీడన్ ప్రయత్నానికి మద్దతు ఇవ్వబోమని చెప్పారు. 'ఉగ్రవాదులు'గా భావించే కుర్దిష్ సమూహాలను అణిచివేయడంలో స్టాక్‌హోమ్ విఫలమైని టర్కీ ఆరోపిస్తోంది.