
Pope Francis latest updates: మరణానంతరం పోప్ ఫ్రాన్సిస్ తొలి ఫొటోను విడుదల చేసిన వాటికన్
ఈ వార్తాకథనం ఏంటి
క్యాథలిక్ క్రైస్తవ మతపరమైన అత్యున్నత స్థానం వహించిన పోప్ ఫ్రాన్సిస్ సోమవారం కన్నుమూశారు.
ఆయనకు స్ట్రోక్ రావడంతో పాటు గుండెకు సంబంధించిన సమస్యలు తలెత్తడం వల్ల మృతిచెందినట్లు వాటికన్‌లోని వైద్యులు వెల్లడించారు.
ఆయన మరణం అనంతరం తీసిన తొలి చిత్రం తాజాగా విడుదల చేయగా, అందులో ఓపెన్ శవపేటికలో పోప్ ఫ్రాన్సిస్ విశ్రమిస్తున్న దృశ్యం కనిపించింది.
అదే సమయంలో, వాటికన్ విదేశాంగ వ్యవహారాల కార్యదర్శి ఆయనకు ప్రార్థనలు అర్పిస్తున్న దృశ్యం కనిపించింది.
వివరాలు
శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో ఎప్పుడైనా అంత్యక్రియలు
ఇక పోప్ అంత్యక్రియల కోసం సన్నాహక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
వాటికన్ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం, శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో ఎప్పుడైనా అంత్యక్రియలు నిర్వహించే అవకాశమున్నది.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చర్చించేందుకు మంగళవారం రోమ్‌లో కార్డినల్స్ సమావేశమవుతున్నారు.
ఇటలీ సమయానుసారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి రోమ్‌లో ఉన్న అందరి కార్డినల్స్‌ను ఆహ్వానించారు.
ఇందులో భాగంగా, పోప్ భౌతికదేహాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాకు తరలించే సమయం, ప్రజల సందర్శనార్థం ఎలా ఉంచాలన్న విషయాలపై చర్చించనున్నారు.
వివరాలు
అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
మరోవైపు, పోప్ ఫ్రాన్సిస్‌కు గౌరవంగా వాటికన్ తొమ్మిది రోజుల సంతాప కాలాన్ని ప్రకటించింది.
ఖననం, అంత్యక్రియలను, ఆయన మరణించిన నాలుగు నుంచి ఆరు రోజుల మధ్యలో నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపారు.
అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరవనున్నట్లు ప్రకటించారు.
రోమ్‌లో జరిగే ఫ్యూనరల్‌కు తన భార్య మెలానియాతో కలిసి వెళ్లనున్నట్లు తెలిపారు.
ఈ విషయాన్ని ట్రుత్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మరోవైపు, రెండోసారి పదవిలోకి వచ్చిన తర్వాత ట్రంప్ ఇదే ఆయన తొలి విదేశీ పర్యటన కావడం గమనార్హం.