Brazil Presiden: బాత్రూంలో జారిపడ్డ బ్రెజిల్ అధ్యక్షుడు.. రష్యా పర్యటన రద్దు
బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తన నివాసంలోని బాత్రూంలో జారిపడటంతో తలకు గాయమైంది. లూలా తలకు కుట్లు వేశామని డాక్టర్ రాబర్టో కలీల్ పేర్కొన్నారు. ఇక చిన్న మెదడులో స్వల్ప రక్తస్రావం జరిగినట్లు నిర్ధారించారు. లూలా ఆరోగ్య పరిస్థితిని వారం పాటు పరీక్షించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. గాయం మరింత తీవ్రమవకుండా నిరంతరం పర్యవేక్షించాల్సి ఉందని పేర్కొన్నారు. లూలా ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన అవసరం లేదని, రోజువారి కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని వైద్యులు స్పష్టం చేశారు.
ఎక్కువ దూరం ప్రయాణించకూడదు
అయితే తాత్కాలికంగా ఎక్కువ దూరం విమాన ప్రయాణం చేయడం మంచిది కాదని సూచించారు. ఇటువంటి పరిస్థితుల్లో రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు లూలా వ్యక్తిగతంగా హాజరుకాలేకపోతున్నా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటారని ఆయన కార్యాలయం ప్రకటించింది. శనివారం సాయంత్రం రష్యాకు వెళ్లాల్సిన షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు.