Maldives: 'అప్పటిలోగా మాల్దీవుల నుంచి భారత సైన్యం వెళ్లిపోవాలి'.. ముయిజ్జు అల్టిమేటం
మాల్దీవులు, భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా భారత సైన్యానికి మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు అల్టిమేటం జారీ చేశారు. మార్చి 15లోగా మాల్దీవుల నుంచి భారత్ తమ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అధికారంగా వెల్లడించారు. ఈ విషయాన్ని మాల్దీవుల అధ్యక్ష కార్యాలయ అధికార ప్రతినిధి అబ్దుల్లా నజీమ్ ఇబ్రహీం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల రాజకీయ నాయకులు అవమానకర వ్యాఖ్యల తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు (జనవరి 14) మాల్దీవుల రాజధాని మాలేలో మాల్దీవుల విదేశాంగ శాఖ అధికారులతో భారత హైకమిషన్ అధికారులు సమావేశం నిర్వహించారు.
రెండు దేశాల మధ్య ఆదివారం అధికారిక చర్చలు
దళాల ఉపసంహరణకు సంబంధించి రెండు దేశాల మధ్య ఆదివారం అధికారిక చర్చలు జరిగాయని మాల్దీవుల వార్తాపత్రిక సన్ ఆన్‌లైన్ ఇంటర్నేషనల్ పేర్కొంది. ఇరు దేశాల మధ్య ఈ సమస్యను పరిష్కరించడానికి ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దాని సభ్యులు కూడా సమావేశానికి హాజరయ్యారు. సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని ముయిజు భారత్‌ను కోరడం ఇదే మొదటిసారి కాదు. ముయిజ్జు అధ్యక్షుడు అయిన తర్వాత భారత్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే అప్పుడు గడవు విధించలేదు. ఇప్పుడు గడువు విధంచడం గమనార్హం.
సైనికులకు సంబంధించిన వివాదం ఏమిటి?
మాల్దీవుల్లో 70 మందికి పైగా భారతీయ సైనికులు ఉన్నారు. కోస్టల్ రాడార్ ఆపరేషన్‌తో పాటు భారతదేశం మాల్దీవులకు బహుమతిగా ఇచ్చిన విమానాల మరమ్మతు వంటి పనుల కోసం ఈ సైనికులను మోహరించారు. ఈ గస్తీ అనేది భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దీని ద్వారా హిందూ మహాసముద్రాన్ని పర్యవేక్షించడం ఈజీ అవుతుంది. ఇదిలా ఉంటే, ముయిజ్జు ఇటీవల 5 రోజుల చైనా పర్యటనకు వెళ్లారు. చైనా నుంచి తిరిగిన వచ్చిన తర్వాత.. అధ్యక్షుడు ముయిజ్జూ భారత్‌పై పరోక్ష విమర్శలు చేశారు. తమ దేశం చిన్నదే అయినా తనను బెదిరించే హక్కు ఎవరికీ లేదని భారత్‌ను ఉద్దేశించి పరోక్షంగా అనడం గమనార్హం.