LOADING...
Iran: చర్చల పేరుతో ఒత్తిడి.. అమెరికా డిమాండ్లను తిప్పికొట్టిన ఇరాన్
చర్చల పేరుతో ఒత్తిడి.. అమెరికా డిమాండ్లను తిప్పికొట్టిన ఇరాన్

Iran: చర్చల పేరుతో ఒత్తిడి.. అమెరికా డిమాండ్లను తిప్పికొట్టిన ఇరాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2026
11:03 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఇరాన్ తమ షరతులను అంగీకరించకపోవడంతో ఒప్పందం కుదరలేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. మరోవైపు చర్చలు విఫలమవడానికి కారణం అమెరికా చేసిన అర్థంలేని డిమాండ్లేనని ఇరాన్ తీవ్రంగా ఆరోపించింది. యుద్ధంతో సాధించలేని అంశాలను చర్చలలో ప్రస్తావించారని విమర్శించింది. ఇరాన్ అధికారిక మీడియా ప్రకారం దేశ జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ ప్రతినిధి బృందం 21 గంటలపాటు చర్చలు జరిపింది. ఒప్పందం సాధించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ, అమెరికా పెట్టిన అనవసర డిమాండ్లే చర్చలను దెబ్బతీశాయని పేర్కొంది. యుద్ధం ద్వారా సాధించలేని విషయాలను చర్చల్లో పెట్టడం సరైన పద్ధతి కాదని ఘనాలోని ఇరాన్ రాయబార కార్యాలయం వ్యాఖ్యానించింది.

వివరాలు

హర్మూజ్ జలసంధి మూసే ఉంటుంది

అలాంటి ప్రతిపాదనలను తాము పూర్తిగా తిరస్కరించినట్లు స్పష్టం చేసింది. హర్మూజ్ జలసంధి మూసే ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఖాళీ చేతులతో వెనుదిరిగారని ఇరాన్ ఎద్దేవా చేసింది. తమ ప్రతిష్ఠను కాపాడుకోవడానికి అమెరికాకు మార్గం లేకుండా పోయిందని కూడా వ్యాఖ్యానించింది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ, చర్చల సమయంలో అనేక అంశాలపై ఇరుదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ, రెండు కీలక అంశాలపై విభేదాలు రావడంతో ఒప్పందం సాధ్యపడలేదని తెలిపారు. అయితే ఆ అంశాల వివరాలను వెల్లడించలేదు. కాగా, హర్మూజ్ జలసంధి, అలాగే ఇరాన్ అణు హక్కులపై ఉన్న విభేదాలే చర్చల విఫలానికి ప్రధాన కారణాలుగా ఇరాన్ మీడియా పేర్కొంది.

Advertisement