గాజా ఆస్పత్రిపై దాడి.. పశ్చిమాసియాలో ఉద్ధృతంగా పాలస్తీనా అనుకూల నిరసనలు
గాజాలోని ఆస్పత్రిపై రాకెట్ దాడి వల్ల 500మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు. ఈ దాడి ఇజ్రాయెల్ చేసిందని హమాస్ మిలిటెంట్ గ్రూపు ప్రకటించింది. దీంతో పశ్చిమాసియాలోని పలు దేశాల్లో పాలస్తీనా అనుకూల నిరసనలు ఉద్ధృతమయ్యాయి. ఆస్పత్రిపై దాడికి నిరసనగా జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో వందలాది మంది వీధుల్లోకి వచ్చారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర ఒక సమూహం గుమిగూడడంతో భద్రతా దళాలు వారిని నివారించాయి. ఈ సందర్భంగా నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా దళాలు టియర్ గ్యాస్ ప్రయోగించినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. లెబనాన్‌లో వందలాది మంది నిరసనకారులు బీరుట్‌లోని యూఎస్ ఎంబసీ సమీపంలో వీధుల్లోకి వచ్చారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అనేక మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు.
ఫ్రెంచ్, బ్రిటిష్ రాయబార కార్యాలయాల వెలుపల కూడా నిరసనలు
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో, ఫ్రెంచ్, బ్రిటిష్ రాయబార కార్యాలయాల వెలుపల కూడా నిరసనలు జరిగాయి. ఎస్ఫహాన్, కోమ్ వంటి ఇతర నగరాల్లో కూడా ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు జరిగాయి. ఆస్పత్రిపై తాము దాడి చేయలేదని ఇజ్రాయెల్ పేర్కొంది. హమాస్ మిలిటెంట్లు చేసిన మిస్ ఫైర్ వల్ల రాకెట్ గాజాలోని ఆస్పత్రి వైపు దూసుకెళ్లినట్లు చెప్పింది. ఈ దాడికి హమాస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేసింది. అయితే ఇజ్రాయెల్ భయంతో ఇళ్లను ఖాళీ చేసిన వేలాది మంది నిరాశ్రయులకు ఆ ఆసుపత్రి ఆశ్రయం కల్పిస్తున్నట్లు పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అమ్మాన్‌లో నిరసనల నేపథ్యంలో అరబ్ దేశాలతో అమెరికా అధ్యక్షుడి సమావేశం కూడా రద్దైంది.