LOADING...
Putin-Bush: 20 ఏళ్ల తర్వాత బయటపడిన పుతిన్‌-బుష్‌ సంభాషణలు.. పాక్‌ అణ్వాయుధాలపై కీలక వ్యాఖ్యలు!
20 ఏళ్ల తర్వాత బయటపడిన పుతిన్‌-బుష్‌ సంభాషణలు.. పాక్‌ అణ్వాయుధాలపై కీలక వ్యాఖ్యలు!

Putin-Bush: 20 ఏళ్ల తర్వాత బయటపడిన పుతిన్‌-బుష్‌ సంభాషణలు.. పాక్‌ అణ్వాయుధాలపై కీలక వ్యాఖ్యలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 26, 2025
01:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

రెండు దశాబ్దాల క్రితం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ మధ్య జరిగిన పాకిస్థాన్‌ అణ్వాయుధాలపై కీలక సంభాషణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఇరువురు నేతల మధ్య జరిగిన ఈ చర్చలకు సంబంధించిన ట్రాన్స్‌క్రిప్ట్‌లను నేషనల్‌ సెక్యూరిటీ ఆర్కైవ్‌ విడుదల చేసింది. ఈ పత్రాల ప్రకారం, పాకిస్థాన్‌ అణ్వాయుధ కార్యక్రమంపై ఇద్దరు నేతలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. జూన్‌ 16, 2001న స్లోవేనియాలో జార్జ్‌ డబ్ల్యూ బుష్‌, పుతిన్‌ల మధ్య వ్యక్తిగత సమావేశం జరిగింది. ఆ సందర్భంగా పాకిస్థాన్‌ అణ్వాయుధాలపై పుతిన్‌ గట్టిగా ఆందోళన వ్యక్తం చేసినట్లు ట్రాన్స్‌క్రిప్ట్‌లు వెల్లడించాయి.

Details

ఇరువురి మధ్య పలుమార్లు ప్రత్యక్ష సమావేశాలు

2001 నుంచి 2008 మధ్యకాలంలో ఇరువురి మధ్య పలుమార్లు ప్రత్యక్ష సమావేశాలు, ఫోన్‌ కాల్‌ సంభాషణలు జరిగినట్లు పత్రాలు సూచిస్తున్నాయి. ఈ సంభాషణల్లో పాకిస్థాన్‌ సైనిక అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ నేతృత్వంలోని అణు కార్యక్రమం, ముఖ్యంగా నాన్‌-ప్రొలిఫెరేషన్‌ అంశంపై ఇరువురు నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు వెల్లడైంది. పాకిస్థాన్‌ అణ్వాయుధాల విషయంలో పుతిన్‌ వ్యక్తం చేసిన భయాందోళనలతో పాటు, బుష్‌ కూడా అదే స్థాయిలో ఆందోళన వ్యక్తం చేసినట్లు ట్రాన్స్‌క్రిప్ట్‌లు చెబుతున్నాయి. అదే సమయంలో పుతిన్‌ను నమ్మదగిన నేతగా బుష్‌ అభివర్ణించినట్లు పత్రాల్లో పేర్కొన్నారు. పాకిస్థాన్‌ అణ్వాయుధ కార్యక్రమానికి రూపశిల్పిగా భావించే అబ్దుల్‌ ఖదీర్‌ ఖాన్‌ అంశం 2005 సెప్టెంబర్‌ 29న ఓవల్‌ ఆఫీస్‌లో జరిగిన సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.

Details

ఇస్లామాబాద్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చిన వాషింగ్టన్

ఆ సమావేశంలో ఇరానియన్‌ సెంట్రిఫ్యూజ్‌ల కోసం పాకిస్థాన్‌కు చెందిన యురేనియం కొనుగోలు చేసిన విషయాన్ని పుతిన్‌ బుష్‌కు వివరించినట్లు ట్రాన్స్‌క్రిప్ట్‌లు వెల్లడించాయి. దీన్ని ఆధారంగా తీసుకుని, ఇస్లామాబాద్‌కు చెందిన అణు నెట్‌వర్క్‌ ఇతర దేశాలకు కూడా విస్తరిస్తోందన్న అనుమానాన్ని పుతిన్‌ వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన బుష్‌ ఈ విషయం అత్యంత ఆందోళనకరమని అంగీకరిస్తూ, దీనిని స్పష్టమైన ఉల్లంఘనగా అభివర్ణించారు. ఈ సంభాషణల ద్వారా పాకిస్థాన్‌ అణ్వాయుధ శక్తి అమెరికాకూ తీవ్ర ఆందోళన కలిగించిందని స్పష్టమవుతోంది. అబ్దుల్‌ ఖదీర్‌ ఖాన్‌ వ్యవహారంలో వాషింగ్టన్‌ ఇస్లామాబాద్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చినట్లు కూడా సమాచారం.

Advertisement

Details

జైలులో పెట్టి గృహ నిర్బంధంలో ఉంచారు

అప్పటి పాకిస్థాన్‌ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌తో తాను మాట్లాడతానని బుష్‌ పుతిన్‌కు భరోసా ఇచ్చారు. అబ్దుల్‌ ఖదీర్‌ ఖాన్‌తో పాటు అతని సహచరులను జైలులో పెట్టారని, గృహ నిర్బంధంలో ఉంచారని బుష్‌ పేర్కొన్నారు. అయితే అణ్వాయుధ సాంకేతికతను ఎవరికెవరికీ పంచారో, ఏ దేశాలకు బదిలీ చేశారో పూర్తిగా తెలుసుకోవాలన్న ఆసక్తి అమెరికాకు ఉందని కూడా బుష్‌ స్పష్టం చేశారు.

Advertisement