Trump-Putin: పుతిన్ షాక్: అమెరికాతో ప్లుటోనియం ఒప్పందం రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్ యుద్ధంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అవలంబిస్తున్న వైఖరిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా విమర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్ అమెరికాకు మరో గట్టి షాకిచ్చారు. అగ్రరాజ్యంతో కొనసాగుతున్న ప్లుటోనియం ఒప్పందాన్ని (Plutonium Deal) ఆయన రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి సంబంధించిన చట్టపరమైన పత్రాలపై పుతిన్ ఇటీవల సంతకం చేశారు. దీంతో ప్రపంచ రాజకీయ వర్గాల్లో మళ్లీ అణు ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. 2000 సంవత్సరంలో అమెరికా,రష్యా మధ్య 'ప్లుటోనియం మేనేజ్‌మెంట్ అండ్ డిస్‌పోజిషన్ అగ్రిమెంట్' కుదిరింది. అనంతరం 2010లో దానిలో సవరణలు చేశారు.
వివరాలు
అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా పుతిన్ నిర్ణయం
ఈ ఒప్పందం ప్రకారం,ప్రచ్ఛన్న యుద్ధం అనంతరం రెండు దేశాలు తమ వద్ద ఉన్న 34 మెట్రిక్ టన్నుల ప్లుటోనియంను అణ్వాయుధాల తయారీకి కాకుండా,పౌర అణు శక్తి ఉత్పత్తి కోసం వినియోగించుకోవాలని నిర్ణయించాయి. ఈ ఒప్పందం వల్ల దాదాపు 17వేల అణ్వాయుధాల తయారీని అడ్డుకోవచ్చని అప్పట్లో అమెరికా అధికారులు పేర్కొన్నారు. అయితే,2016లో బరాక్ ఒబామా అధ్యక్షతన ఉన్నప్పుడు అమెరికా-రష్యా సంబంధాలు దిగజారాయి. దాంతో పుతిన్ ఆఒప్పందం అమలును నిలిపివేశారు.ఇప్పుడు ఆయన అధికారికంగా ఆ అగ్రిమెంట్‌ను పూర్తిగా రద్దు చేస్తూ చట్టపరమైన ఆమోదం ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న సమయంలో పుతిన్ ఈ నిర్ణయం తీసుకోవడం అంతర్జాతీయ వేదికలపై చర్చనీయాంశంగా మారింది. ఈచర్యతో రష్యా మళ్లీ అణ్వాయుధాల తయారీ వేగంపెంచే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు.