Loading...
APEC Summit 2026: ఒకే వేదికపై పుతిన్‌, ట్రంప్‌, జిన్‌పింగ్‌.. ప్రపంచ శాంతిపై చర్చలు
ఒకే వేదికపై పుతిన్‌, ట్రంప్‌, జిన్‌పింగ్‌.. ప్రపంచ శాంతిపై చర్చలు

APEC Summit 2026: ఒకే వేదికపై పుతిన్‌, ట్రంప్‌, జిన్‌పింగ్‌.. ప్రపంచ శాంతిపై చర్చలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
12:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగనున్న సమావేశంపై ఆశాభావం వ్యక్తం చేశారు. చైనాలోని షెన్‌జెన్‌లో జరిగే ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక సహకార (APEC) సదస్సు సందర్భంగా ముగ్గురు నేతలు త్రైపాక్షికంగా భేటీ కానున్నారు. ఈ సమావేశం ద్వారా గణనీయమైన ప్రయోజనాలు చేకూరుతాయని భావిస్తున్నట్లు పుతిన్‌ తెలిపారు. 2026 ఏపీఈసీ సీఈవో సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన.. ప్రపంచ దేశాల మధ్య సహకారం, అంతర్జాతీయ పరిణామాలపై మాట్లాడారు.

వివరాలు

అంతర్జాతీయ సంబంధాల బలోపేతానికి అవకాశం

ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనేక విభజనలను ఎదుర్కొంటోందని, సైనిక, రాజకీయపరమైన ఆందోళనలు కూడా పెరుగుతున్నాయని పుతిన్‌ అన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో దేశాలు ఒంటరిగా ఉండటం కంటే పరస్పర భాగస్వామ్యంతో ముందుకు సాగాలని సూచించారు.

నిర్మాణాత్మక చర్చలకు ఏపీఈసీ వేదిక అవకాశం కల్పిస్తోందని పేర్కొన్నారు. ఏపీఈసీ వేదికపై నిర్మాణాత్మకంగా అభిప్రాయాలను పంచుకునేందుకు అవకాశం ఉంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విభజనకు గురవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, సైనిక, రాజకీయపరమైన ఆందోళనలు నెలకొన్న వేళ.. ఒంటరితనం కంటే భాగస్వామ్యమే అవసరం.

అందుకే ఏపీఈసీ సదస్సు సందర్భంగా జరగనున్న రష్యా, చైనా, అమెరికా దేశాధినేతల త్రైపాక్షిక సమావేశం ద్వారా భారీ ప్రయోజనాలు ఉంటాయని ఆశిస్తున్నానని పుతిన్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు

సమావేశ అజెండాపై భిన్నాభిప్రాయాలు?

ముగ్గురు నేతలు గురువారం చైనా అధ్యక్షుడి అధికారిక నివాసంలో సమావేశం కావాల్సి ఉంది. అయితే చర్చించాల్సిన అంశాల విషయంలో దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఈ భేటీకి అడ్డంకిగా మారే అవకాశముంది.

అణ్వస్త్రాల విస్తరణ నిరోధం, మధ్యప్రాచ్య సంఘర్షణకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా శ్వేతసౌధం భావిస్తున్నట్లు సమాచారం.

ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చకు ప్రాధాన్యం ఇవ్వాలని పుతిన్‌ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ అజెండా విభేదాలే సదస్సుకు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉందని ఎవర్‌కోర్‌ ఐఎస్ఐ చీఫ్‌ చైనా వ్యూహకర్త నియో వాంగ్‌ సీఎన్‌బీసీతో అన్నారు.

ADVERTISEMENT

వివరాలు

అణ్వస్త్ర నిరాయుధీకరణపై చైనా వైఖరి

అమెరికాతో అణ్వస్త్ర నిరాయుధీకరణ చర్చల్లో పాల్గొనేందుకు చైనా ప్రస్తుతం ఆసక్తి చూపడం లేదని సమాచారం. అమెరికాతో అణ్వస్త్ర సామర్థ్యంలో సమాన స్థాయికి చేరుకునే వరకు ఈ అంశంపై చర్చలకు సిద్ధంగా లేదని తెలుస్తోంది.

ఆగస్టులో చైనా ఈ విషయంలో తన వైఖరిని స్పష్టం చేసింది. అమెరికా, రష్యాలతో అణ్వస్త్ర నిరాయుధీకరణ చర్చల్లో చైనా కూడా పాల్గొనాలని కోరడం ''అసమంజసం, వాస్తవికం కానిది'' అని పేర్కొంది.

అమెరికా, చైనా అణ్వస్త్ర సామర్థ్యాలు ఏమాత్రం సమాన స్థాయిలో లేవని వివరించింది.

మరోవైపు ముగ్గురు దేశాధినేతలు తమ తొలి త్రైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో 'ప్రపంచ శాంతి'పై చర్చించనున్నట్లు చైనా సోమవారం వెల్లడించింది.

ADVERTISEMENT