Loading...
Putin: కలినిన్‌గ్రాడ్‌పై దాడి జరిగితే అణ్వాయుధాలు వాడతాం: పుతిన్‌ హెచ్చరిక
కలినిన్‌గ్రాడ్‌పై దాడి జరిగితే అణ్వాయుధాలు వాడతాం: పుతిన్‌ హెచ్చరిక

Putin: కలినిన్‌గ్రాడ్‌పై దాడి జరిగితే అణ్వాయుధాలు వాడతాం: పుతిన్‌ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా-పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ కీలక హెచ్చరికలు చేశారు. రష్యా భూభాగమైన కలినిన్‌గ్రాడ్‌పై ప్రత్యక్ష దాడి జరిగితే.. తమ వద్ద ఉన్న అన్ని రకాల ఆయుధాలను వినియోగించే అంశం వెంటనే తెరపైకి వస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే అణ్వాయుధాలను కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించారు. మాస్కోలో నిర్వహించిన వాల్డై ఫోరంలో పుతిన్‌ మాట్లాడారు. యూరప్‌లోని ఏ దేశంపైనా దాడి చేయాలన్న ఉద్దేశం రష్యాకు లేదని ఆయన తెలిపారు. శాంతియుత సహజీవనాన్నే తమ దేశం కోరుకుంటోందన్నారు. అయితే కలినిన్‌గ్రాడ్‌ లేదా రష్యాలోని ఇతర ప్రాంతాలపై నేరుగా దాడి జరిగితే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని హెచ్చరించారు.

వివరాలు 

ఉద్రిక్తతలు మరింత పెరిగితే..

తమ వద్ద ఉన్న ఆయుధ సంపద రష్యాకు వ్యూహాత్మక ప్రయోజనాన్ని కల్పిస్తోందని పేర్కొన్నారు.

బ్రిటన్‌, ఫ్రాన్స్‌ వద్ద ఉన్న అణ్వాయుధ సామర్థ్యాల గురించి కూడా తమకు పూర్తి అవగాహన ఉందని చెప్పారు.

ప్రస్తుత ఉద్రిక్తతలు మరింత పెరిగితే పరిస్థితులు తిరిగి వెనక్కి రాలేని స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని పుతిన్‌ హెచ్చరించారు.

ప్రపంచంలోని ప్రధాన శక్తుల వద్ద భారీ విధ్వంసానికి దారితీసే ఆయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు.

వాటిని ఉపయోగించే పరిస్థితులు ఏర్పడకుండా చూడాల్సిన బాధ్యత అన్ని దేశాలపైనా ఉందని సూచించారు.

వివరాలు 

కలినిన్‌గ్రాడ్‌ రష్యాకు చెందిన భూభాగం

ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న దాడులను నిలిపివేసే ప్రసక్తే లేదని కూడా పుతిన్‌ స్పష్టం చేశారు.

రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్‌ జరిపిన దాడుల కారణంగా తమ దేశ జీడీపీలో దాదాపు ఒక శాతం మేర నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు.

పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు రష్యా భూభాగంలోకి మరింత లోతుగా దాడులు చేసే సామర్థ్యాన్ని అందిస్తే.. దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

కలినిన్‌గ్రాడ్‌ రష్యాకు చెందిన భూభాగం. ఇది పోలాండ్‌,లిథువేనియా మధ్య బాల్టిక్‌ సముద్ర తీరంలో ఉంది.

చుట్టూ నాటో సభ్య దేశాలు ఉండటంతో వ్యూహాత్మకంగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఉంది.

రష్యా ఇక్కడ భారీగా సైనిక బలగాలు,వ్యూహాత్మక ఆయుధ వ్యవస్థలను మోహరించింది.

ADVERTISEMENT

వివరాలు 

స్పందించిన నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రుట్టే

ఈ భౌగోళిక పరిస్థితుల కారణంగా కలినిన్‌గ్రాడ్‌ రష్యా-నాటో మధ్య కీలక ఉద్రిక్తత ప్రాంతంగా మారింది.

కలినిన్‌గ్రాడ్‌ను నాటో నుంచి వేరుచేసే లేదా దానిపై ముప్పు కలిగించే చర్యలు జరిగితే అణ్వాయుధాలను సహా అన్ని సామర్థ్యాలను ఉపయోగించే అవకాశం ఉందని రష్యా దౌత్యపరమైన హెచ్చరికలు జారీ చేసినట్లు నాటో తెలిపింది.

నాటో ప్రధాన కార్యదర్శి మార్క్‌ రుట్టే దీనిపై స్పందించారు. నాటో రక్షణాత్మక కూటమి మాత్రమేనని, అణ్వాయుధాల బెదిరింపులు అవసరం లేనివని ఆయన పేర్కొన్నారు.

రష్యా నుంచి నాటో భూభాగానికి తక్షణ ముప్పు ఉందని తాము అంచనా వేయడం లేదని కూడా రుట్టే తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

రక్షణాత్మక కూటమిగా వ్యవహరిస్తున్నాం: నాటో

మొత్తంగా రష్యా-నాటో మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలకు కలినిన్‌గ్రాడ్‌ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఒకవైపు పుతిన్‌ రష్యా భూభాగంపై దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరిస్తుండగా.. మరోవైపు నాటో మాత్రం తాము రక్షణాత్మక కూటమిగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేస్తోంది.

ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా-పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా జాగ్రత్త వహించాల్సిన అవసరాన్ని ఇరుపక్షాల వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

ADVERTISEMENT