Putin Tour: ఈరోజు నుంచే రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన...కీలక ఒప్పందాలపై సంతకాలు
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత తొలిసారిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వస్తున్నారు. చివరిసారిగా ఆయన 2021లో భారత్ కు వచ్చారు. ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో, పుతిన్ ఈరోజు, రేపు రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటిస్తున్నారు. ఒకవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చేందుకు అమెరికా ప్రయత్నాలు కొనసాగుతుండగా, క్రెమ్లిన్‌లో రెండు దేశాల అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు యుద్ధ సమయంలో రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తోందంటూ భారత్‌పై అమెరికా 25 శాతం అదనపు సుంకాలు విధించింది.
వివరాలు
రెండు రోజుల పాటు దేశంలో పుతిన్
అయితే అమెరికా ఎలాంటి చర్యలు తీసుకున్నా తమ దేశాల ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇద్దరూ స్పష్టంగా చెప్పారు. ఈ పరిణామాలన్నింటి మధ్య పుతిన్ భారత పర్యటనకు అంతర్జాతీయంగా విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ఈ భేటీని రెండు దేశాలే కాక ప్రపంచమంతా నిశితంగా గమనిస్తోంది. భారత్ పర్యటన షెడ్యూల్ ప్రకారం పుతిన్ రెండు రోజుల పాటు దేశంలో ఉండనున్నారు. మొత్తం 30 గంటలకు పైగా ఢిల్లీలో గడపనున్నట్టు సమాచారం. రేపు సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకోనుండగా, ప్రధాని మోదీ స్వయంగా ఆయనకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. ప్రధాని మోదీతో ప్రైవేట్ విందు సహా పలు వ్యక్తిగత సమావేశాలు ఇప్పటికే షెడ్యూల్లో ఉన్నాయి.
వివరాలు
హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షికస్థాయి, ప్రతినిధి బృందస్థాయి చర్చలు
డిసెంబర్ 5 ఉదయం 9.30 గంటలకు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్ కు అధికారిక స్వాగత కార్యక్రమం జరగనుంది. అనంతరం రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి ప్రధాని మోదీ, పుతిన్ తో పాటు ఇతర నేతలు నివాళులు అర్పించనున్నారు. తదుపరి పరిమిత స్థాయి చర్చలు జరుగుతాయి. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షికస్థాయి, ప్రతినిధి బృందస్థాయి చర్చలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ప్రతినిధులతో కలిసి భోజన కార్యక్రమం జరగనుంది. ఈ భేటీలో పలువురు ప్రముఖ భారత పారిశ్రామికవేత్తలు కూడా పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. భోజనానంతరం హైదరాబాద్ హౌస్‌లోనే పలు కీలక ఒప్పందాలపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేయనున్నారు.
వివరాలు
ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు
వాటిపై సంయుక్త ప్రకటనలు చేయడంతోపాటు మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఇందులో ఇండియా-రష్యా బిజినెస్ ఫోరం కార్యక్రమంలో ప్రధాని మోదీ, పుతిన్ ఇద్దరూ పాల్గొనవచ్చని సమాచారం. సాయంత్రం రాష్ట్రపతి ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్న అనంతరం పుతిన్ భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదరనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారత్‌తో పౌర అణుశక్తి రంగంలో సహకార ఒప్పందానికి ఇప్పటికే రష్యా చట్టసభ డ్యూమా ఆమోదం తెలిపింది. ఈ పర్యటనలోనే ఆ ఒప్పందంపై ఇరు దేశాధినేతలు సంతకాలు చేయనున్నారు.
వివరాలు
ఐదవ తరం యుద్ధ విమానాలైన Su-57లను భారత్‌కు సరఫరా
వాణిజ్య రంగంలోనూ పలు అవగాహన ఒప్పందాలు కుదరనున్నాయి. ఇప్పటికే అమలులో ఉన్న ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనున్నారు. అంతేకాదు,ఐదవ తరం యుద్ధ విమానాలైన Su-57లను భారత్‌కు సరఫరా చేసేందుకు రష్యా సానుకూలంగా స్పందించింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, పరస్పర సహకారాన్ని విస్తరించడమే లక్ష్యమని అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. ఆయిల్, పరిశ్రమలు, అంతరిక్షం, వ్యవసాయం, టెక్నాలజీ రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టేందుకు రెండు దేశాలు ముందుకు సాగనున్నాయని చెప్పారు. భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచే అంశంపై కూడా ప్రధాని మోదీతో చర్చించనున్నట్టు పుతిన్ వెల్లడించారు. భవిష్యత్తులోనూ భారత్‌కు రష్యా ప్రధాన ఇంధన సరఫరాదారుగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.