qatar: భారత నేవీ అధికారులకు మరణశిక్ష రద్దుపై భారత్ విజ్ఞప్తి.. ఆమోదించిన ఖతర్
భారతదేశం నేవీ అధికారులకు మరణశిక్షను రద్దు చేయాలని భారత్ చేసిన విజ్ఞప్తిని, ఖతర్ కోర్టు ఆమోదించింది. గూఢచర్యం ఆరోపణల కేసులో గత నెలలో మరణ శిక్ష పడిన ఎనిమిది మంది మాజీ భారత నావికాదళ సిబ్బందికి మరణశిక్షపై భారతదేశం చేసిన అప్పీల్‌ను ఖతార్ కోర్టు అంగీకరించింది. అప్పీల్‌ను పరిశీలించిన తర్వాత ఖతార్ కోర్టు విచారణ తేదీని నిర్ణయిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఎనిమిది మంది వ్యక్తులను గూఢచర్యం కేసులో ఖతార్ గూఢచార సంస్థ 2022 ఆగస్టులో అరెస్టు చేసింది. ఇదే సమయంలో ఖతార్ అధికారులు బారత అధికారులపై ఉన్న ఆరోపణలను బహిర్గతం చేయలేదు. అయినప్పటికీ నేవీ అధికారుల బెయిల్ పిటిషన్‌లు చాలాసార్లు తిరస్కరణకు గురయ్యాయి.
ప్రధాని మోదీ కలగజేసుకోవాలి : మీటూ భార్గవ
అరెస్ట్ అయిన జాబితాలో కమాండర్ పూర్ణేందు తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ సంజీవ్ గుప్తా, కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్ వశిష్ట్, సెయిలర్ రాగేష్ గోపకుమార్ ఉన్నారు. మాజీ నేవీ అధికారులందరూ ఇండియన్ నేవీలో 20 సంవత్సరాలకుపైగా విశిష్ట సేవలు అందించారు. అయితే ఖతర్ అదుపులోకి తీసుకున్న మాజీ అధికారుల్లో ఒకరి సోదరి మీటూ భార్గవ తన సోదరుడిని తిరిగి తీసుకువచ్చేందుకు కేంద్రం సహాయం కోరింది. ఈ మేరకు ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని, మాజీ నావికాదళ అధికారులు దేశానికే గర్వకారణమని, ఆలస్యం చేయకుండా వారందరినీ వెంటనే తిరిగి తీసుకురావాలని కోరారు.