Qatar: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలపై ఖతార్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న పరిస్థితిపై ఖతార్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రాంతంలోని దేశాలు ఏవీ ఇరాన్‌కు శత్రువులు కాదని స్పష్టం చేసింది. పరస్పర దాడులు కొనసాగితే ఏ పక్షానికీ ప్రయోజనం ఉండదని హెచ్చరించింది. అమెరికా, ఇరాన్ తక్షణమే శత్రుత్వాన్ని పక్కనబెట్టి దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఖతార్ పిలుపునిచ్చింది. గత రెండు వారాలుగా అమెరికా, ఇజ్రాయెల్ చేపడుతున్న తీవ్రస్థాయి బాంబుదాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ ప్రాంతంలోని పొరుగు దేశాలపై దాడులు చేస్తున్నట్లు సమాచారం. ఈ దాడుల్లో పలువురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా కీలక మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.
గల్ఫ్
ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు చాలా దురదృష్టకరం: మహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-ఖులైఫీ
ముఖ్యంగా గల్ఫ్ ప్రాంత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఇంధన సరఫరా వ్యవస్థ ఈ ఉద్రిక్తతల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతోంది. పౌర నివాసాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులపై ఖతార్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అల్ జజీరాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఖతార్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-ఖులైఫీ ప్రస్తుత పరిస్థితులపై స్పందించారు. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ఈసంక్షోభానికి శాశ్వత పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమవుతుందని ఖతార్ బలంగా నమ్ముతుందని పేర్కొన్నారు. ఖతార్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. తమ దేశ ప్రయోజనాలు,ప్రాంతీయ భద్రతను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వివరాలు
'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోతే..
తమ దేశంపై దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో మధ్యవర్తిత్వం చేయడం సాధ్యం కాదని ఇరాన్ గుర్తించాలని ఆయన సూచించారు. ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' మార్గంలో నౌకల రాకపోకలు నిలిచిపోతే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని బిన్ అబ్దుల్ అజీజ్ అల్-ఖులైఫీ అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు వెంటనే పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ దేశాలు ఇరాన్‌కు వ్యతిరేకంగా లేవన్న విషయాన్ని టెహ్రాన్ సరిగా అర్థం చేసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ఇరు పక్షాలకు ఖతార్ విజ్ఞప్తి
ఇప్పటికే ఖతార్ ప్రధాని మొహమ్మద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అల్ థానీ ఇరాన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, పొరుగు దేశాలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని కోరారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తో కూడా ఖతార్ నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తోంది. యుద్ధ పరిస్థితులను విడిచిపెట్టి శాంతి మార్గంలో ముందుకు సాగాలని ఇరు పక్షాలకు ఖతార్ విజ్ఞప్తి చేస్తోంది.