Asim Munir: భారత్‌తో యుద్ధానికి ఆసిమ్ మునీర్ సిద్ధం: ఇమ్రాన్ ఖాన్ సోదరి సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో యుద్ధానికి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తహతహలాడుతున్నారని పేర్కొన్నారు. అయితే, తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ మాత్రం పొరుగుదేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పారు. ఒక మీడియా ఇంటర్వ్యూలో అలీమా ఖాన్ మాట్లాడుతూ, మునీర్‌ను "ఇస్లామిక్ ఛాందసవాది"గా వివరించారు. అలాగే, తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ స్వేచ్ఛావాదిగా, సమకాలీన రాజకీయ పరిణామాలను సానుకూలంగా ఎదుర్కొనే వ్యక్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితుల గురించి ప్రశ్నించగా, అలీమా ఖాన్ ఆసిమ్ మునీర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
వివరాలు
మునీర్ భారత్‌తో ఘర్షణలకు దిగుతాడు: అలీమా ఖాన్
"ఆసిమ్ మునీర్ ఇస్లామిక్ ఛాందసవాదిగా ఉన్నందున, భారత్‌తో ఘర్షణలకు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇమ్రాన్ ఖాన్ పొరుగుదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నించారు. సందర్భం వచ్చినప్పుడల్లా మునీర్ భారత్‌తో ఘర్షణలకు దిగుతాడు. ఇది భారత్‌తో పాటు దాని మిత్ర దేశాలకు కూడా నష్టమే' అని అలీమా ఖాన్ అన్నారు. ఇక పాకిస్తాన్‌లో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే మృతి చెందారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంతో, ఆయన మరో సోదరి ఉజ్మా ఖానుమ్ మంగళవారం ఆయనను కలిసారు.
వివరాలు
పాకిస్థాన్ ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఉజ్మా ఖాన్
సమావేశం తర్వాత ఉజ్మా మీడియాతో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ జైల్లో సురక్షితంగా ఉన్నప్పటికీ, మానసికంగా వేధింపులకు గురవుతున్నారని తెలిపారు. తాను జైలు శిక్ష అనుభవించడానికి ఆసిమ్ మునీర్ కారణమని ఇమ్రాన్ తనతో చెప్పాడని ఉజ్మా తెలిపారు. ఉజ్మా ఖాన్ ఈ సందర్భంలో పాకిస్థాన్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజలను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నందుకు ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిలో ఒక నేపాలీ సహా 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
రెండు దేశాల మధ్య ఉద్రిక్తత
దీనికి ప్రతీకారంగా భారత్ 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది. ఈ క్రమంలో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను విధ్వంసం చేశారు. ఈ పరిణామాల కారణంగా కొన్ని రోజుల పాటు రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగింది, అనంతరం కాల్పుల విరమణను ప్రకటించారు.