Pakistan: పాక్‌లో సంచలనం.. రామ్ గల్లీగా మారిన రెహ్మాన్ గల్లీ.. లాహోర్ వీధులకు పాత హిందూ, సిక్కు పేర్లు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని లాహోర్ నగరంలో దాదాపు 80 ఏళ్ల తర్వాత పాత హిందూ, సిక్కు, జైన్ పేర్లు మళ్లీ కనిపిస్తున్నాయి. విభజన తర్వాత ఇస్లామిక్ పేర్లు పెట్టిన అనేక వీధులు, చౌరస్తాలకు ఇప్పుడు మళ్లీ పాత పేర్లనే పెడుతున్నారు. ఇస్లాంపురా ఇప్పుడు కృష్ణనగర్‌గా, బాబ్రీ మసీదు చౌక్ జైన్ మందిర్ చౌక్‌గా, రెహ్మాన్ గల్లీ మళ్లీ రామ్ గల్లీగా మారింది. గత రెండు నెలల్లో కనీసం తొమ్మిది ప్రాంతాలకు పాత పేర్లు తిరిగి పెట్టగా.. మరికొన్ని ప్రాంతాల పేర్ల మార్పుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మార్పుల వెనుక పాకిస్థాన్ పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన 'లాహోర్ హెరిటేజ్ ఏరియా రివైవల్' ప్రాజెక్ట్ ఉంది.
వివరాలు
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి.. ఆదాయం పెంచుకోవడమే ప్రధాన ఉద్దేశ్యం
మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కలల ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ఈ పథకానికి సుమారు 50 బిలియన్ పాకిస్థాన్ రూపాయల వ్యయం అవుతోంది. నగరపు పాత సంస్కృతి, వారసత్వ నిర్మాణాలను తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 2025లో నవాజ్ షరీఫ్, ఆయన కుమార్తె, ప్రస్తుత పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ఆదాయం పెంచుకోవడమూ ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో మింటో పార్క్‌లో పాత క్రికెట్ మైదానాలు, కుస్తీ అఖాడాలను కూడా పునరుద్ధరించాలని నవాజ్ షరీఫ్ ప్రతిపాదించారు. గతంలో షెహబాజ్ షరీఫ్ సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి పేరుతో ఈ మైదానాలు కూల్చివేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
వివరాలు
IMF సహకారం పొందేందుకు 'సహనశీల దేశం'గా కనిపించాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు
మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ లాంటి ఆటగాళ్లు అక్కడే శిక్షణ పొందారు. భారత మాజీ క్రికెటర్ లాలా అమర్‌నాథ్ కూడా విభజనకు ముందు అక్కడే ఆడినట్టు చెబుతారు. అయితే ఈ పేర్ల మార్పుల వెనుక మరో వ్యూహం కూడా ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ దేశాలకు, ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు పాకిస్థాన్ తన తీవ్రవాద ముద్రను తొలగించుకుంటోందనే సందేశం ఇవ్వాలని ఇస్లామాబాద్ ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక సహాయం, విదేశీ పెట్టుబడులు, IMF సహకారం పొందేందుకు 'సహనశీల దేశం'గా కనిపించాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు చేపడుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
మళ్లీ పాత పేర్లు పెడుతున్న ప్రాంతాల జాబితా ఇదే..
ఇస్లామిక్ పేరు పునరుద్ధరించిన పేరు 1. సున్నత్ నగర్ సంత్ నగర్ 2. మౌలానా జాఫర్ అలీ ఖాన్ చౌక్ లక్ష్మీ చౌక్ 3. ముస్తఫాబాద్ ధరంపుర 4. సర్ ఆగా ఖాన్ కూడలి డేవిస్ రోడ్డు 5. అల్లామా ఇక్బాల్ రోడ్డు జైలు రోడ్డు 6. ఫాతిమా జిన్నా రోడ్డు క్వీన్స్ రోడ్డు 7.బాగ్-ఎ-జిన్నా లారెన్స్ గార్డెన్స్ 8. ఇస్లాంపుర కృష్ణ నగర్ 9. హమీద్ నిజామీ రోడ్డు టెంపుల్ స్ట్రీట్ 10. నిష్టర్ రోడ్ బ్రాండ్రెత్ రోడ్ 11. రెహమాన్ గల్లీ రామ్ గల్లీ 12. బాబ్రీ మసీద్ చౌక్ జైన్ మందిర్ రోడ్ 13. ఘజియాబాద్ కుమ్హర్‌పురా 14. జీలానీ రోడ్ అవుట్‌ఫాల్ రోడ్ 15. షహరా-ఇ-అబ్దుల్ హమీద్ బిన్ బదీస్ ఎంప్రెస్ రోడ్