Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదుల హింస.. ప్రముఖ గాయకుడు జేమ్స్ కచేరీపై దాడి
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ అంతటా మతోన్మాద శక్తులు మరింత రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే ఇద్దరు హిందువులను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటనలు దేశాన్ని కలచివేశాయి. అంతేకాదు, కళాకారులు, సాంస్కృతిక ప్రతీకలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రముఖ బంగ్లా గాయకుడు, రాక్‌స్టార్ జేమ్స్ నిర్వహించాల్సిన కచేరీపై దాడి జరగడం కలకలం రేపింది. ఢాకాకు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫరీద్‌పూర్‌లోని ఒక స్థానిక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు జేమ్స్ కచేరీ జరగాల్సి ఉంది. అయితే కొందరు దుండగులు అకస్మాత్తుగా కార్యక్రమ ప్రాంగణంలోకి చొరబడి వేదికపైకి ఇటుకలు, రాళ్లు విసిరారు. పరిస్థితి అదుపు తప్పడంతో స్థానిక అధికారుల ఆదేశాల మేరకు చివరికి కచేరీని రద్దు చేయాల్సి వచ్చింది.
Details
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అశాంతి వాతావరణం
ఈ దాడిలో 25 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనపై వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. బంగ్లా రాక్‌స్టార్ జేమ్స్ ప్రదర్శనను జిహాదీ శక్తులు అడ్డుకున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ వ్యాప్తంగా రాడికల్ గుంపులు కళాకారులు, సాంస్కృతిక సంస్థలు, జర్నలిస్టులు, వార్తాపత్రికల కార్యాలయాలపై వరుస దాడులకు పాల్పడుతున్నాయని ఆమె విమర్శించారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ మతోన్మాద శక్తుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడంలో విఫలమవుతోందని, పరోక్షంగా మద్దతు ఇస్తోందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్లనున్న బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అశాంతి వాతావరణం నెలకొని ఉండటం ఆందోళన కలిగిస్తోంది.