
Diwali: అమెరికాలో భారతీయ సంస్కృతికి గౌరవం.. కాలిఫోర్నియాలో దీపావళికి అధికారిక సెలవు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయుల పండుగ దీపావళికి అమెరికాలో మరింత ప్రతిష్ఠ దక్కింది. కాలిఫోర్నియాలో దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం అధికారిక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఆ రోజును ప్రభుత్వ సెలవు రోజుగా ప్రకటించారు. ఈ మేరకు ఏబీ-268 (AB-268) బిల్లుపై కాలిఫోర్నియా గవర్నర్ 'గ్యావిన్ న్యూసమ్' సంతకం చేశారు. దీంతో దీపావళి పండుగకు ఆ రాష్ట్రంలో అధికారిక గుర్తింపు లభించింది. దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తించాలని ప్రతిపాదిస్తూ, అమెరికా కాంగ్రెస్‌లో గతంలోనే బిల్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ బిల్లుకు ఆమోదం లభించగా, గవర్నర్ సంతకం చేయడంతో అది చట్టరూపం దాల్చింది. ఈ చట్టం ప్రకారం 2026 జనవరి 1వ తేదీ నుంచి దీపావళి పండుగను రాష్ట్ర పండుగగా పాటించనున్నారు.
Details
ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు
ఆ రోజున కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు లభించనుంది. అదనంగా పాఠశాలలు, కమ్యూనిటీ కాలేజీలు కూడా ఈ రోజున సెలవు ఇవ్వవచ్చు. అయితే కోర్టులకు మాత్రం ఈ సెలవు వర్తించదని చట్ట నిబంధనల్లో పేర్కొన్నారు. అమెరికాలో ఇప్పటికే పెన్సిల్వేనియా, కనెక్టికట్ రాష్ట్రాలు దీపావళిని రాష్ట్ర పండుగగా గుర్తించాయి. ఇప్పుడు కాలిఫోర్నియా ఆ జాబితాలో మూడో రాష్ట్రంగా చేరింది. ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసించారు. అమెరికాలో భారతీయ సంస్కృతికి ఇది గొప్ప గుర్తింపు అని, సాంస్కృతిక వైవిధ్యానికి గౌరవం తెలిపే చారిత్రక నిర్ణయం అని భారతీయ వర్గాలు, ప్రజాప్రతినిధులు, సాంస్కృతిక సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి.