LOADING...
Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. రాయబార కార్యాలయాలపై దాడులు, భారతీయులకు హైకమిషన్‌ హెచ్చరిక!
బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. రాయబార కార్యాలయాలపై దాడులు, భారతీయులకు హైకమిషన్‌ హెచ్చరిక!

Bangladesh: బంగ్లాదేశ్‌లో మళ్లీ అల్లర్లు.. రాయబార కార్యాలయాలపై దాడులు, భారతీయులకు హైకమిషన్‌ హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 20, 2025
08:44 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగ్లాదేశ్‌ మరోసారి అల్లర్లతో భగ్గుమంది. గతేడాది ఆగస్టులో షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీలీగ్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక పాత్ర పోషించిన 'విద్యార్థుల ఉద్యమం'కు సంబంధించి ముఖ్య నేత మరణం దేశాన్ని హింసలోకి నెట్టింది. ఆ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇంకిలాబ్‌ మోంచో యువ నాయకుడు షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ సింగపూర్‌లోని ఓ ఆసుపత్రిలో గురువారం రాత్రి మృతి చెందడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. రాజధాని ఢాకా సహా పలు జిల్లాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోగా, పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళనకారులు భారత రాయబార కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని భారీ నిరసనలకు దిగారు. చిట్టగాంగ్‌లోని అసిస్టెంట్‌ ఇండియన్‌ హైకమిషనర్‌ నివాసంపై రాళ్ల వర్షం కురిపించారు.

Details

పత్రికా కార్యాలయాలపై దాడి

ఢాకాలోని భారత రాయబార కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా పత్రికా కార్యాలయాలపై కూడా ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. దేశంలోని ప్రధాన పత్రికలైన ప్రొథోమ్‌ ఆలో, ది డైలీ స్టార్‌ భవనాలకు నిప్పంటించారు. ఈ ఘటనల్లో కొందరు పాత్రికేయులు అగ్నికీలల్లో చిక్కుకోగా, సైన్యం వారిని రక్షించింది. ఆందోళనకారులతో మాట్లాడేందుకు ప్రయత్నించిన 'న్యూ ఏజ్‌' ఎడిటర్‌ నూరుల్‌ కబీర్‌పై కూడా దాడి జరిగింది. ఈ పరిణామాలతో శుక్రవారం దేశంలోని ప్రధాన పత్రికలు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి.

Details

బుల్డోజర్‌తో అవామీలీగ్‌ పార్టీ కార్యాలయం ధ్వంసం

ఇప్పటికే ధ్వంసమైన బంగ్లాదేశ్‌ జాతిపిత షేక్‌ ముజీబుర్‌ రెహమాన్‌ నివాసంపై మళ్లీ దాడి జరిగింది. రాజ్‌షాహీలోని అవామీలీగ్‌ పార్టీ కార్యాలయాన్ని బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు. అలాగే ఢాకాలోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ ఛాయానట్‌ ప్రాంగణాన్ని ధ్వంసం చేసి నిప్పంటించారు. గతేడాది జులై, ఆగస్టులో విద్యార్థుల ఉద్యమం ఉద్ధృతం కావడంతో షేక్‌ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు పారిపోయి వచ్చిన విషయం తెలిసిందే. అనంతరం మహమ్మద్‌ యూనస్‌ ముఖ్య సలహాదారుడిగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినా, దేశంలో హింసాత్మక ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని యూనస్‌ ఇటీవల ప్రకటించినా, పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.

Advertisement

Details

భారత్‌ వ్యతిరేకి.. హాదీ

సింగపూర్‌లో చికిత్స పొందుతూ మృతి చెందిన షరీఫ్‌ ఉస్మాన్‌ హాదీ ఇంకిలాబ్‌ మోంచో పార్టీకి చెందిన ముఖ్య నేత. గతేడాది షేక్‌ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో కీలక పాత్ర పోషించిన ఆయన, ఆ సందర్భంగా భారత్‌పై తీవ్ర విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరిలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న ఢాకాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ముసుగు ధరించిన వ్యక్తి బైక్‌పై వచ్చి హాదీ తలపై గురిపెట్టి కాల్చాడు. తీవ్రంగా గాయపడిన హాదీని గురువారం రాత్రి ఆయన మరణించినట్లు మహమ్మద్‌ యూనస్‌ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం హాదీ మృతదేహం ఢాకాకు చేరుకోగా, శనివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని ఇంకిలాబ్‌ మోంచో పార్టీ ప్రకటించింది.

Advertisement

Details

 చెట్టుకు వేలాడదీసి.. ఆపై నిప్పంటించి..

ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మయమన్‌సింగ్‌ జిల్లాలో 25 ఏళ్ల దీపూ చంద్ర దాస్‌పై మూక దాడి జరిగింది. గురువారం రాత్రి కొందరు దుండగులు అతడిని తీవ్రంగా కొట్టి, చెట్టుకు వేలాడదీసి ఉరి తీశారు. అనంతరం రహదారి పక్కన పడేసి, మళ్లీ మృతదేహానికి నిప్పంటించారు. ఈ ఘటనతో ఆ రహదారిపై ట్రాఫిక్‌ పూర్తిగా నిలిచిపోయింది. ఈ సంఘటనపై మహమ్మద్‌ యూనస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హీనమైన నేరానికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పత్రికా కార్యాలయాలపై దాడులను ఖండించిన ఆయన, పాత్రికేయులకు క్షమాపణలు చెప్పారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, మూక హింసకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

Details

భారతీయులు అప్రమత్తంగా ఉండాలి

తాజా పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్‌ అడ్వైజరీ జారీ చేసింది. దేశంలో నివసిస్తున్న భారతీయులు, భారత విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 'ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అనవసర ప్రయాణాలు చేయవద్దు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో సహాయం కోసం భారత హైకమిషన్‌, అసిస్టెంట్‌ హైకమిషన్‌ కార్యాలయాలను సంప్రదించండని భారత దౌత్యాధికారులు తమ అడ్వైజరీలో పేర్కొన్నారు.

Advertisement