Russian Oil: రష్యాపై ఆంక్షల ఎఫెక్ట్.. ఒక్క రోజే 16% పెరిగిన ట్యాంకర్ల ఛార్జీలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా ప్రధాన చమురు సంస్థలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల తర్వాత, రష్యా ముడిచమురు కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం ప్రారంభించారు. ఈ క్రమంలో చమురు రవాణా చేసే సూపర్ ట్యాంకర్ల ఛార్జీలు అమాంతం పెరగడం గమనార్హం. ప్రత్యేకంగా, మధ్యప్రాచ్యం-చైనా రూట్‌లో ఈ ట్యాంకర్ల ఛార్జీలు ఒక్క రోజే 16 శాతం పెరిగింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నడుపుతున్న యుద్ధ చర్యలకు ప్రతిగా,రష్యాలోని అతి పెద్ద చమురు కంపెనీలు రాస్‌నెఫ్ట్, లుకాయిల్ వంటి సంస్థలపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ బుధవారం ఆంక్షలు ప్రకటించారు. దీని కారణంగా, ప్రధానంగా ఈ కంపెనీల నుండి చమురు కొనుగోలు చేస్తున్న భారత, చైనా రిఫైనరీలు అప్రమత్తమయ్యాయి.
వివరాలు
చమురు దిగుమతుల కోసం మధ్యప్రాచ్యపు మార్గాల పరిశీలన
ఈ రిఫైనరీలు రష్యా చమురు కొనుగోళ్లను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో, డిమాండ్‌ను తీర్చడానికి చమురు దిగుమతుల కోసం మధ్యప్రాచ్యపు మార్గాలను పరిశీలిస్తున్నారని సమాచారం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో, మధ్యప్రాచ్యం-చైనా మార్గంలో ఫ్రీట్ అగ్రిమెంట్ల ముగింపుకు సమీపిస్తుండటం వలన సూపర్ ట్యాంకర్ల ఛార్జీలు గురువారం 16 శాతం పెరిగాయి, అని బాల్టిక్ ఎక్స్చేంజ్ డేటా వెల్లడించింది. 2023 తర్వాత ఈ స్థాయిలో ట్యాంకర్ల ఖర్చులు మొదటిసారి నమోదవడం విశేషం. డిసెంబరు కాంట్రాక్టుల ఛార్జీలు కూడా దాదాపు 13 శాతం పెరిగినట్లు సమాచారం.
వివరాలు
ఆర్థిక పరిమితులు విధించిన యూరోపియన్ యూనియన్
అమెరికా వెల్లడించిన ప్రకారం, రష్యా కంపెనీలు,వాటికి అనుబంధంగా పనిచేసే డజన్ల కొద్దీ సంస్థలపై ఆంక్షలు అమలు కాబోతున్నాయి. అదే సమయంలో, యూరోపియన్ యూనియన్ కూడా ఆర్థిక పరిమితులు విధించింది. ఈ ఆంక్షలు నవంబర్ 21 నుండి అమల్లోకి రానున్నాయి. అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ (IEA) డేటా ప్రకారం, ఆగస్టులో రష్యా రోజుకు 7.3 మిలియన్ బ్యారెల్ ఇంధనాన్ని ఎగుమతి చేసింది. ఇది ప్రపంచ ముడిచమురు, రిఫైన్డ్ ఇంధన వినియోగంలో దాదాపు 7 శాతంకి సమానం.