Russia: భారత్‌కు నిరాటంకంగా ఇంధనం, ఎరువులు.. పుతిన్ కీలక హామీ
ఈ వార్తాకథనం ఏంటి
చిరకాల మిత్రదేశమైన భారత్‌కు ఇంధనం, ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సహకరిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం, హార్మూజ్ జలసంధి దిగ్బంధం కారణంగా ఇంధనం, ఎరువుల సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్న నేపథ్యంలో భారత్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. వాణిజ్యం, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, సాంస్కృతిక రంగాల్లో సహకారంపై చర్చించేందుకు నిర్వహించిన ఇండో-రష్యా అంతర్ ప్రభుత్వ కమిషన్ (ఐఆర్‌ఐజీసీ) సమావేశంలో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ రష్యా వెళ్లారు. ఈ సందర్భంగా సోమవారం మాస్కోలో ఆయన పుతిన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కూడా పాల్గొన్నారు.
వివరాలు
ఐఆర్‌ఐజీసీ సమావేశంలో సహసారథి హోదాలో జైశంకర్
భారత రైతులు, వ్యవసాయ రంగానికి శక్తిమేరకు సహకరిస్తామని పుతిన్ హామీ ఇచ్చినట్లు రష్యా ప్రభుత్వరంగ వార్తాసంస్థ టాస్ వెల్లడించింది.
భారత రైతుల కోసం, వ్యవసాయ రంగం కోసం రష్యా చేయగలిగినంత సాయం చేస్తుందని, భవిష్యత్తులోనూ తమ సహాయ సహకారాలు కొనసాగుతాయని పుతిన్ పేర్కొన్నట్లు తెలిపింది.
అంతకుముందు జైశంకర్ ఐఆర్‌ఐజీసీ సమావేశంలో సహసారథి హోదాలో పాల్గొన్నారు.
రష్యా ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ (డీపీఎం) డెనిస్ మంటురోవ్‌తో కలిసి ఆయన ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
వచ్చే ఏడాది 12-13 తేదీల్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ ఢిల్లీకి రానున్న నేపథ్యంలో జైశంకర్ రష్యా పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
వివరాలు
మోదీజీ ఎదురుచూపులు..
పుతిన్‌తో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తరఫున జైశంకర్ శుభాకాంక్షలు తెలిపారు.
షాంఘై సహకార సంఘం సమావేశంలో పుతిన్‌తో చర్చించేందుకు ప్రధాని మోదీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన చెప్పారు.
అదే భేటీలో పుతిన్‌ను బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానించేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
వాణిజ్యం, ఇంధనం, ఎరువులు, పౌర అణు ఇంధనం సహా అనేక రంగాల్లో భారత్-రష్యా పరస్పర సహకారం మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు.
ఐఆర్‌ఐజీసీ సమావేశం ఎంతో విజయవంతంగా సాగిందని పుతిన్‌కు తెలిపారు.
వివరాలు
4 రెట్లు పెరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం
27వ ఐఆర్‌ఐజీసీ సమావేశంలో జైశంకర్ ద్వైపాక్షిక వాణిజ్యంపై కీలక వివరాలు వెల్లడించారు.
భారత్-రష్యా మధ్య వాణిజ్యం 2021-22లో 13 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2025-26 నాటికి నాలుగు రెట్లు పెరిగి 60 బిలియన్ డాలర్లకు చేరిందని తెలిపారు.
అయితే ఎగుమతులతో పోలిస్తే దిగుమతులు భారీగా పెరగడంతో ఇరుదేశాల మధ్య వాణిజ్యలోటు గణనీయంగా విస్తరించిందని జైశంకర్ పేర్కొన్నారు.
2021-22లో 6.6 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు.. 2025-26 నాటికి ఏకంగా 50 బిలియన్ డాలర్లకు చేరిందని వివరించారు.
వివరాలు
4 రెట్లు పెరిగిన ద్వైపాక్షిక వాణిజ్యం
ఈ ప్రతికూల ధోరణిని సరిదిద్దేందుకు భారత్ చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
రష్యా మార్కెట్‌లో భారతీయ ఉత్పత్తులకు మరిన్ని అవకాశాలు కల్పించడం, టారిఫ్‌లను తొలగించడం, ఇరుదేశాల వ్యాపార సంస్థల మధ్య మరింత బలమైన వాణిజ్య సంబంధాలను ఏర్పాటు చేయడం ద్వారా వాణిజ్యలోటును తగ్గించాలని భారత్ భావిస్తోందన్నారు.
2030 నాటికి భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నామని జైశంకర్ వెల్లడించారు.