Pavel Durov: రష్యా సంచలన నిర్ణయం.. ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ డురోవ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్‌పై రష్యా కీలక చర్యలు చేపట్టింది. 'ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఆయనను ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చినట్లు రష్యా ప్రధాన అంతర్గత భద్రతా సంస్థ (Federal Security Service) బుధవారం ప్రకటించింది. భద్రతా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. రష్యాలో దాడులు నిర్వహించేందుకు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థలు, ఉగ్రవాద గ్రూపులు టెలిగ్రామ్ వేదికను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయని ఆరోపించింది. సైబర్ నేరాలు, భారీ స్థాయిలో హత్యలకు సంబంధించిన ప్రణాళికలు, ఉగ్రవాద వ్యూహాల రూపకల్పనతో పాటు వాటి అమలుకు కూడా టెలిగ్రామ్‌ను ప్రధాన కమ్యూనికేషన్ వేదికగా మార్చుకున్నట్లు పేర్కొంది.
వివరాలు
ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే .. ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో
ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థలు, ఉగ్రవాద గ్రూపులు నిర్వహిస్తున్న పలు టెలిగ్రామ్ ఛానళ్లు, చాట్ గ్రూపులు, బాట్లను తొలగించాలని రష్యా ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు టెలిగ్రామ్ యాజమాన్యాన్ని ఆదేశించినట్లు తెలిపింది.
అయితే ఆ సూచనలను టెలిగ్రామ్ పట్టించుకోలేదని ఆరోపించింది.
దీంతో ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరిస్తున్నారనే అభియోగాల ఆధారంగా పావెల్ డురోవ్‌ను ఇంటర్నేషనల్ వాంటెడ్ లిస్ట్‌లో చేర్చినట్లు వెల్లడించింది.
అదే సమయంలో దేశంలో టెలిగ్రామ్ సేవలను కూడా నిలిపివేసినట్లు పేర్కొంది.
వివరాలు
ఈ ఆరోపణలపై స్పందించని పావెల్ డురోవ్
అంతేకాకుండా ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థలు టెలిగ్రామ్‌ను కేవలం దాడుల ప్రణాళికలకే కాకుండా కొత్త తరహా నియామక ప్రక్రియ (రిక్రూట్‌మెంట్) కోసం కూడా వినియోగిస్తున్నాయని ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ఆరోపించింది.
అందమైన యువతుల పేర్లతో రూపొందించిన నకిలీ ప్రొఫైల్స్ (బాట్స్) ద్వారా రష్యాలోని యువకులను ఆకర్షించి, వారిని ఉగ్రదాడులు, ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆస్తులకు నిప్పంటించడం వంటి విద్రోహ కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రేరేపిస్తున్నాయని పేర్కొంది.
అయితే ఈ ఆరోపణలపై టెలిగ్రామ్ లేదా పావెల్ డురోవ్ నుంచి అధికారిక స్పందన వెలువడలేదు.