Page Loader
Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు.. 600 డ్రోన్లు, క్షిపణులతో ఐదు నగరాలపై యుద్ధవాతావరణం
ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు.. 600 డ్రోన్లు, క్షిపణులతో ఐదు నగరాలపై యుద్ధవాతావరణం

Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడులు.. 600 డ్రోన్లు, క్షిపణులతో ఐదు నగరాలపై యుద్ధవాతావరణం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 12, 2025
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రతరమయ్యాయి. ఇటీవల కీవ్‌ నగరంలో ఉన్న ఆయుధ పరిశ్రమలపై మాస్కో భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడులలో దాదాపు 600కి పైగా డ్రోన్లు, క్షిపణులను వినియోగించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. కేవలం ఆయుధ పరిశ్రమలే కాకుండా, ఉక్రెయిన్‌ సైనిక రిక్రూట్‌మెంట్ కేంద్రాలు, వైమానిక స్థావరాలూ లక్ష్యంగా మారాయి. ఈ దాడుల ధాటికి నివాస భవనాలు, విశ్వవిద్యాలయాలు, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలువురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకారం, రష్యా ప్రయోగించిన 319 డ్రోన్లతో పాటు 25 క్రూజ్‌ క్షిపణులను భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.

Details

 మాస్కోలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి

అదే సమయంలో కీవ్‌ చేపట్టిన కౌంటర్ దాడుల్లో మాస్కోలోని పలు భవనాలు దెబ్బతిన్నాయని సమాచారం. మరోవైపు, రష్యా యుద్ధానికి అవసరమైన బాలిస్టిక్‌ క్షిపణులు, ఫిరంగి వ్యవస్థలలో 40 శాతం వరకు ఉత్తరకొరియా నుంచి వస్తున్నాయన్న ఉక్రెయిన్‌ ఆరోపణల తర్వాతే ఈ మూడో దశ దాడులు జరిగాయి. ఈ దాడులపై తీవ్రంగా స్పందించిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలొడిమిర్‌ జెలెన్‌స్కీ, పుతిన్‌ సేనలకు గట్టి బదులు ఇస్తామని ప్రకటించారు. యుద్ధం విషయంలో త్వరితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిన ఆయుధాల సరఫరాను తిరిగి ప్రారంభించింది. అందులో 155 మిల్లీమీటర్ల మందుగుండు సామగ్రితో పాటు, అధిక ఖచ్చితత్వంతో దాడి చేసే జీఎంఎల్‌ఆర్‌ఎస్‌ రాకెట్లు ఉన్నట్లు అధికారికంగా వెల్లడించారు.