
Ukraine crisis: రష్యా భీకర దాడి.. ఉక్రెయిన్‌పై 367 డ్రోన్లు, క్షిపణులతో భారీ విధ్వంసం
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్-రష్యాల మధ్య ఓవైపు యుద్ధ ఖైదీల మార్పిడి కొనసాగుతుండగా, మరోవైపు ఆర్మీ దాడులు మాత్రం తగ్గడం లేదు.
తాజాగా రష్యా ఉక్రెయిన్‌పై అత్యంత భారీ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది.
ఆదివారం దాదాపు 367 రకాల క్షిపణులు, డ్రోన్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడగా, ఈ దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదే యుద్ధంలో ఒకేరోజు జరిగిన అతిపెద్ద డ్రోన్, క్షిపణి దాడిగా ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి.
ఈ దాడులకు ముందే, శుక్రవారం రెండు దేశాలు 390 మంది ఖైదీలను పరస్పరం విడుదల చేయగా, శనివారం 307 మంది, తాజాగా మరో 303 మంది యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకున్నాయి.
Details
దాడులను ఖండించిన జెలెన్‌స్కీ
కానీ ఖైదీల విడుదల నేపథ్యంలో శాంతి చర్చలు మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపించకముందే, మాస్కో మరోసారి హింసాత్మక దాడులకు పాల్పడింది.
ఒకేరోజు 69 క్షిపణులు, 298 డ్రోన్లను వదిలిన రష్యా, ఉక్రెయిన్‌లోని కీవ్ సహా 30 నగరాలు, గ్రామాలపై లక్ష్యంగా దాడులు నిర్వహించింది.
ఈ దాడుల్లో ఇరాన్ తయారు చేసిన షాహెద్ డ్రోన్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. రష్యాపై మరింత కఠిన ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాలకు విజ్ఞప్తి చేశారు.
రష్యా నాయకత్వంపై బలమైన ఒత్తిడి తెచ్చేంత వరకు ఈ దాడులకు అంతు పడదని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ పరిణామాలతో యుద్ధ భూభాగంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.