 
                                                                                Russia: కొత్త అణుశక్తితో నడిచే బ్యూరెవెస్ట్నిక్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన రష్యా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచం ఇప్పటివరకు అణ్వస్త్రాలను మోసుకెళ్లే క్షిపణులను మాత్రమే చూసింది. అయితే రష్యా ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, అణుశక్తితో నడిచే నూతన క్షిపణిని అభివృద్ధి చేసింది. గాల్లో 'అపరిమిత' సమయం పాటు సంచరించగల ఈ క్షిపణి రూపకల్పన పూర్తయిందని, దీని మోహరింపుకు అవసరమైన మౌలిక వసతులను సిద్ధం చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సైనికాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి క్షిపణి మరే దేశానికీ లేదని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
అణు సామర్థ్యాల ప్రదర్శన విన్యాసాలను స్వయంగా పర్యవేక్షించిన పుతిన్
ఇటీవల రష్యా సైన్యం అణు సామర్థ్యాల ప్రదర్శన విన్యాసాలు నిర్వహించగా,పుతిన్ స్వయంగా వాటిని పర్యవేక్షించారు. ఈ సందర్భంలో ఆయన,'బురెవెస్ట్‌నిక్' క్రూజ్ క్షిపణి విజయవంతంగా పరీక్షించబడిందని వెల్లడించారు. పరీక్షల సమయంలో ఈ క్షిపణి సుమారు 15 గంటల పాటు గాల్లోనే సంచరించి, దాదాపు 14 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిందని వివరించారు. అయితే,ఇదే దీని గరిష్ఠ సామర్థ్యం కాదని, సిద్ధాంతపరంగా దీని పరిధి అపరిమితమని పుతిన్ పేర్కొన్నారు. 'బురెవెస్ట్‌నిక్' సాంకేతిక లక్షణాల ప్రకారం, ఇది దూరంగా ఉన్న లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదని రష్యా సైన్య చీఫ్ ఆఫ్ స్టాఫ్ వాలెరీ గెరాసిమోవ్ తెలిపారు.
వివరాలు
10 వేల మందికి పైగా ఉక్రెయిన్ సైనికులను చుట్టుముట్టిన రష్యా బలగాలు
ప్రపంచంలోని అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను సైతం మోసం చేసే సామర్థ్యం ఈ క్షిపణికి ఉందని ఆయన అన్నారు. తాజా పరీక్షల్లో, ఈ క్షిపణి 50 నుంచి 100 మీటర్ల ఎత్తులో విహరించి, ప్రత్యర్థిని మభ్యపెట్టేందుకు తరచుగా తన దిశను మార్చుకుంటూ ప్రయాణించినట్లు వివరించారు. అదేవిధంగా, రష్యా బలగాలు ఇటీవల 10 వేల మందికి పైగా ఉక్రెయిన్ సైనికులను చుట్టుముట్టినట్లు గెరాసిమోవ్ తెలిపారు. మొత్తం 31 బెటాలియన్లతో కూడిన ఉక్రెయిన్ దళాలను తాము అడ్డుకున్నామని ఆయన పేర్కొన్నారు.