Loading...
Indian Run Pharma Plant: భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా దాడి.. భారీగా మంటలు, రూ.400 కోట్ల నష్టం!
భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా దాడి.. భారీగా మంటలు, రూ.400 కోట్ల నష్టం!

Indian Run Pharma Plant: భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా దాడి.. భారీగా మంటలు, రూ.400 కోట్ల నష్టం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2026
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఉన్న భారతీయ ఫార్మా కంపెనీపై రష్యా డ్రోన్‌ దాడులు చేసింది. కుసుమ్‌ గ్రూప్‌కు చెందిన ఫార్మా ప్లాంట్‌పై డ్రోన్లతో దాడి జరగడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. దాడుల కారణంగా ఫార్మా ప్లాంట్‌ ప్రధాన నిర్మాణం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ దాడుల వల్ల భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. సుమీ ప్లాంట్‌పై జరిగిన దాడులతో సుమారు రూ.400 కోట్ల మేర నష్టం జరిగినట్లు కుసుమ్‌ కంపెనీ అంచనా వేసింది.

వివరాలు

1994లో పంపిణీదారుగా కుసుమ్‌ గ్రూప్‌ ప్రారంభం

కుసుమ్‌ గ్రూప్‌ 1994లో భారతీయ ఔషధాలను ఉక్రెయిన్‌కు ఎగుమతి చేసే పంపిణీదారుగా తన కార్యకలాపాలను ప్రారంభించింది.

2002లో ఇతర కంపెనీల ఔషధ ఉత్పత్తుల పంపిణీని నిలిపివేసి.. సొంత బ్రాండ్‌లను మార్కెటింగ్‌ చేయడం ప్రారంభించింది.

ఆ తర్వాత కుసుమ్‌ గ్రూప్‌ తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. 2007లో భారత్‌లో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.

అనంతరం 2009లో ఉక్రెయిన్‌లోని సుమీలో ఫార్మా ప్లాంట్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత భారత్‌లో మరో రెండు ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసింది.

వివరాలు

9కి పైగా దేశాల్లో జనరిక్‌ మందుల విక్రయం

కుసుమ్‌ గ్రూప్‌ ప్రస్తుతం 50కి పైగా జనరిక్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది.

వీటిని ప్రధానంగా ఉక్రెయిన్‌, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌ సహా తొమ్మిదికి పైగా దేశాల్లో విక్రయిస్తోంది.

భారత్‌కు చెందిన రాజీవ్‌ గుప్తా ప్రస్తుతం కుసుమ్‌ గ్రూప్‌ను నడుపుతున్నారు. ఉక్రెయిన్‌లోని సుమీ ప్లాంట్‌పై జరిగిన రష్యా డ్రోన్‌ దాడులతో కంపెనీకి భారీ నష్టం వాటిల్లినట్లు వెల్లడైంది.

ADVERTISEMENT