Loading...
Boris Johnson: రైలుపై రష్యా డ్రోన్‌ దాడి.. త్రుటిలో తప్పించుకున్న యూకే మాజీ ప్రధాని
రైలుపై రష్యా డ్రోన్‌ దాడి.. త్రుటిలో తప్పించుకున్న యూకే మాజీ ప్రధాని

Boris Johnson: రైలుపై రష్యా డ్రోన్‌ దాడి.. త్రుటిలో తప్పించుకున్న యూకే మాజీ ప్రధాని

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 14, 2026
12:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ (Boris Johnson), ఇతర అధికారులు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఉక్రెయిన్‌ పర్యటనలో ఉన్న బోరిస్ జాన్సన్‌ ప్రత్యేక రైలులో ప్రయాణిస్తుండగా.. సమీపంలోని రైల్వే క్రాసింగ్‌పై రష్యా డ్రోన్‌ దాడులు (Russian Drone Attack) చేసింది. ఈ దాడిలో అక్కడి ఇంధన స్టేషన్‌ దెబ్బతినడంతో.. పలు వాహనాలకు మంటలు వ్యాపించాయి. పరిస్థితిని గమనించిన లోకోపైలట్లు వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ప్రయాణికులను రైలు నుంచి కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ రైలులో బోరిస్ జాన్సన్‌తో పాటు స్వీడన్ మాజీ ప్రధాన మంత్రి కార్ల్ బిల్ట్‌, పలువురు యూరోపియన్‌ నేతలు కూడా ఉన్నారు.

వివరాలు

ఉక్రెయిన్‌కు మరింత మద్దతు..

ఇదే ప్రాంతంలో మరో రైలులో అమెరికా సీఐఏ మాజీ చీఫ్‌ డేవిడ్‌ పేట్రియాస్‌ కూడా ఉన్నారు. అక్కడే ఉన్న మరో రైలును పలు డ్రోన్లు ఢీకొన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.

అయితే అధికారులు అప్పటికే ఆ రైలును ఖాళీ చేయించడంతో ఎవరూ గాయపడలేదు. రష్యా జరిపిన డ్రోన్‌ దాడులను బోరిస్ జాన్సన్‌ అర్థరహితమైనవిగా అభివర్ణించారు.

క్రెమ్లిన్‌ దాడుల నుంచి ఉక్రెయిన్‌ ప్రజలను రక్షించేందుకు ఆ దేశానికి మరిన్ని ఆయుధాలు అందించాలని బ్రిటన్‌ ప్రభుత్వానికి పిలుపునిచ్చారు.

ఉక్రెయిన్‌కు అవసరమైన గగనతల రక్షణ వ్యవస్థలను ఎప్పుడు అందిస్తామని ఆయన ప్రశ్నించారు.

మిత్రదేశాలు తగినంత సాయం అందిస్తే.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలొదిమిర్‌ జెలెన్‌స్కీ యుద్ధాన్ని వేగంగా ముగించే అవకాశం ఉంటుందని బోరిస్ జాన్సన్‌ అన్నారు.

వివరాలు

భయపడుతూ జీవించాల్సి వస్తోంది

పౌర రైల్వేలను (Civilian Railways) కూడా రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని, దీంతో ఉక్రెయిన్‌ ప్రజలు ప్రతిరోజూ ఇలాంటి ప్రమాదాలను ఎదుర్కొంటూ భయంభయంగా జీవించాల్సి వస్తోందని పేర్కొన్నారు.

పుతిన్‌ ఎన్ని కుట్రలు పన్నినా చివరకు విజయం ఉక్రెయిన్‌దేనని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కొన్నేళ్లుగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌ విమాన సేవలను నిలిపివేసింది.

డ్రోన్‌ దాడులు జరిగే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీంతో అక్కడి ప్రజలు బస్సులు, రైలు సర్వీసులనే ప్రధానంగా వినియోగిస్తున్నారు.

అధికారిక పర్యటనల కోసం వచ్చే విదేశీ నేతలు సైతం రైళ్లలోనే ప్రయాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కీవ్‌లోని రైలు సర్వీసులను కూడా మాస్కో లక్ష్యంగా చేసుకుంటుండటం గమనార్హం.

ADVERTISEMENT