Russia: రష్యాలో125 మందితో అదృశ్యమైన విమానం.. చివరకు సురక్షిత ల్యాండింగ్
ఈ వార్తాకథనం ఏంటి
రష్యాలో 125 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న ఓ విమానం కొద్దిసేపు రాడార్ నుంచి అదృశ్యమై తీవ్ర ఉత్కంఠకు గురిచేసింది. విమానం నుంచి అత్యవసర సంకేతాలు అందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాడార్ సంబంధాలు తెగిపోవడంతో విమానం కూలిపోయి ఉండొచ్చన్న ఆందోళన నెలకొంది. అయితే కొద్దిసేపటికే ఆ విమానం తిరిగి గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం సోచీ విమానాశ్రయంలో అత్యవసరంగా సురక్షిత ల్యాండింగ్ చేశారు. రష్యన్ మీడియా కథనాల ప్రకారం..బుధవారం సాయంత్రం స్మార్టావియా సంస్థకు చెందిన బోయింగ్ 734-800 విమానం సోచీ నుంచి అర్ఖంగెల్స్క్‌కు బయలుదేరింది. నల్ల సముద్రం మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా విమానం నుంచి అత్యవసర సంకేతాలు వచ్చాయి. ఆ వెంటనే రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.
వివరాలు
ప్రత్యామ్నాయ విమానాల్లో ప్రయాణికులను తరలించేందుకు ఏర్పాట్లు
కొద్దిసేపటి తర్వాత విమానం మళ్లీ రాడార్‌పై కనిపించింది. పైలట్లు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి సోచీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 125 మంది ప్రయాణికులతో పాటు ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని రష్యన్ మీడియా వెల్లడించింది. ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు ప్రత్యామ్నాయ విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు గల కారణాలపై సాంకేతిక నిపుణులు దర్యాప్తు చేపట్టారు. విమానం ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపమే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
వివరాలు
అరుదైన ఘటన
సాధారణంగా ఏదైనా విమానానికి రాడార్ సంబంధాలు తెగిపోతే అది ప్రమాదానికి గురై ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతాయి. అలాంటి పరిస్థితుల్లో విమానం మళ్లీ రాడార్‌పై కనిపించి సురక్షితంగా ల్యాండ్ కావడం చాలా అరుదైన ఘటనగా నిపుణులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.