Russian Fuel Tanker: నడి సముద్రంలో 'రష్యా చమురు బాంబ్'.. ఇటలీ, మాల్టాలో ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
నడి సముద్రంలో రష్యా వదిలేసిన ఓ 'చమురు బాంబ్' ప్రస్తుతం రెండు దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డ్రోన్ దాడికి గురై సగం కాలిపోయిన రష్యన్ ఇంధన నౌక పర్యావరణానికి భారీ ప్రమాదం కలిగించవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితి ఏ దిశగా మలుపు తిరుగుతుందో తెలియక సంబంధిత దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి. అసలు ఈ ఘటన ఎలా జరిగింది అంటే...మార్చి 3న రష్యా జెండా ఎగురవేసిన'ఆర్కిటిక్ మెటాగాజ్' అనే చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగింది. మధ్యధరా సముద్రంలో తటస్థ జలాల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు రష్యా విదేశాంగ శాఖ మార్చి 11న వెల్లడించింది. మాల్టా దక్షిణ-ఆగ్నేయ దిశగా సుమారు 168నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపింది.
వివరాలు
నౌకలో సుమారు 900 మెట్రిక్ టన్నుల డీజిల్‌తో పాటు దాదాపు 60 వేల మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జీ
ఈ దాడికి ఉక్రెయిన్ నావెల్ డ్రోన్లే కారణమని రష్యా ఆరోపించినప్పటికీ, కీవ్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి అధికారిక స్పందన ఇవ్వలేదు. ముర్మాన్స్క్‌లోని రష్యన్ ఆర్కిటిక్ పోర్టు నుంచి ఈజిప్టు వైపు వెళ్తున్న ఈ నౌకపై దాడి జరిగింది. ఆ సమయంలో నౌకలో 30 మంది సిబ్బంది ఉండగా, వారిలో కొందరు గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది లైఫ్‌బోట్ సహాయంతో బయటపడిపోయారు. అనంతరం నౌకను అక్కడే వదిలి వెళ్లిపోయారు. అయితే, ఆ నౌకలో సుమారు 900 మెట్రిక్ టన్నుల డీజిల్‌తో పాటు దాదాపు 60 వేల మెట్రిక్ టన్నుల లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) నిల్వ ఉండటం ప్రస్తుతం ప్రధాన ఆందోళనగా మారింది.
వివరాలు
చమురు సముద్రంలోకి కారుతుండటం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది
ప్రస్తుతం ఈ నౌక మాల్టా-ఇటలీ తీరాల మధ్య తేలియాడుతోంది. సగం కాలిపోయి ఒక వైపుకు ఒరిగిన నౌక దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం పొందుతున్నాయి. ఇందులో నుంచి చమురు సముద్రంలోకి కారుతుండటం పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తోంది. బలమైన గాలుల ప్రభావంతో ఈ నౌక ఇటలీ తీరానికి చేరుకునే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. చమురు, గ్యాస్‌తో నిండి ఉన్న ఈ నౌకను 'టైమ్ బాంబ్'గా పేర్కొంటూ, దాన్ని తమ పోర్టులకు రానీయొద్దని ఇటలీ మంత్రులు ప్రధాని జార్జియా మెలోనీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
వివరాలు
నౌక సముద్రంలో మునిగిపోయిన పక్షంలో సముద్ర జీవవ్యవస్థపై తీవ్ర ప్రభావం
మరోవైపు మాల్టా కూడా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటన వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని గ్లోబల్ కన్జర్వేషన్ సంస్థ 'వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్' హెచ్చరించింది. ఈ చమురు నౌక సముద్రంలో మునిగిపోయిన పక్షంలో సముద్ర జీవవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంది. దీర్ఘకాలిక నీటి కాలుష్యం మాత్రమే కాకుండా, క్రయోజనిక్ మేఘాలు ఏర్పడే ప్రమాదం కూడా ఉందని అంచనా వేసింది.