LOADING...
Putin security: పుతిన్ భారత పర్యటన.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
పుతిన్ భారత పర్యటన.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

Putin security: పుతిన్ భారత పర్యటన.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 04, 2025
08:54 am

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గురువారం భారత్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. భారత్‌లో ఉన్న సమయంలో మాత్రమే కాదు... ఎక్కడ ఉన్నా పుతిన్ చుట్టూ రష్యా భద్రతా బలగాలు అప్రమత్తంగా మోహరించి ఉంటాయి. ఆయన కోసం ఎల్లప్పుడూ బలమైన భద్రతా వలయం ఏర్పాటు చేస్తారు. భారత పర్యటన నేపథ్యంలో పుతిన్ భద్రతకు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

వివరాలు 

మలం సేకరించి.. 

పుతిన్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన మలాన్ని సైతం ప్రత్యేక సూట్‌కేస్‌లో భద్రపరచి స్వదేశమైన రష్యాకు తరలిస్తారు. విదేశీ గూఢచారి సంస్థలు అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిని విశ్లేషించకుండా నిరోధించేందుకు ఈ జాగ్రత్త తీసుకుంటారు. పుతిన్ భద్రత కోసం బాడీగార్డులు ఎప్పటికప్పుడు ఆయన వెంటనే ఉంటారు. ఆయన బాత్‌రూంకు వెళ్లిన సమయంలో కూడా భద్రతా సిబ్బంది దగ్గరుండే ఉంటారు.

వివరాలు 

35 ఏళ్లకే బాడీగార్డుల రిటైర్మెంట్‌ 

పుతిన్‌కు భద్రత కల్పించే బాడీగార్డుల ఎంపిక అత్యంత కఠినంగా జరుగుతుంది. ఇందుకోసం పలు దశల పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థుల ఎత్తు 5.8 నుంచి 6.2 అడుగుల మధ్య, బరువు 75 నుంచి 90 కిలోల మధ్య ఉండాలి. విదేశీ భాషలపై అవగాహన కూడా అవసరం. ఎంపికైన వారికి ప్రత్యేక కఠిన శిక్షణ అందిస్తారు. అయితే వారు 35 ఏళ్ల వయసు వచ్చేసరికి రిటైర్ కావాల్సిందే. పుతిన్‌కు అత్యంత సమీపంగా ఎవరైనా రాగానే, వారు ఎంతటి ఉన్నతస్థాయి నేతలైనా సరే—బాడీగార్డులు అడ్డుకోవడం వారి విధి.

Advertisement

వివరాలు 

బాడీ డబుల్స్‌ వినియోగం 

ముఖ్యంగా బహిరంగ కార్యక్రమాల్లో లేదా ముప్పు అధికంగా ఉన్న సందర్భాల్లో పుతిన్ 'బాడీ డబుల్స్‌'ను వాడుతుంటారు. అచ్చం ఆయన మాదిరిగానే కనిపించే వ్యక్తులను భద్రత కోసం ముందుకు తెస్తారని సమాచారం. కనీసం ముగ్గురు బాడీ డబుల్స్‌ను ఉపయోగిస్తున్నారని ఉక్రెయిన్ మిలిటరీ అధిపతి మేజర్ జనరల్ కిరిల్ బుదనోవ్ ఒకసారి వెల్లడించారు. పుతిన్‌లా కనిపించేందుకు వారికి ప్లాస్టిక్ సర్జరీలు చేయించారనికూడా ఆయన పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

నాలుగు టైర్లు పంక్చర్ అయినా ఆగని కారు 

పుతిన్ విదేశీ పర్యటనల సమయంలో ఆయన ప్రయాణించే వాహనం ప్రత్యేకంగా తయారైన ప్రభుత్వ కారు 'ఆరస్ సెనాత్'. దీన్ని రష్యా ఎన్‌ఏఎంఐ ఇన్‌స్టిట్యూట్, ఆరస్ మోటార్స్ డిజైన్ చేశాయి. ఇది పూర్తిగా బుల్లెట్‌ప్రూఫ్ వాహనం. గ్రెనేడ్ దాడులు, అగ్నిప్రమాదాలను తట్టుకునే సామర్థ్యం దీనికి ఉంది. ప్రమాద సమయంలో ఆక్సిజన్ సరఫరా చేసే సదుపాయం కూడా వాహనంలో ఉంది. నాలుగు టైర్లు పంక్చర్ అయినా, ఆ కారు ముందుకుసాగగలదు. గరిష్ఠంగా గంటకు 249 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

వివరాలు 

వ్యక్తిగత ప్రయోగశాల 

పుతిన్ తీసుకునే ఆహారంలో ఏవైనా విషపదార్థాలు ఉన్నాయా అనే విషయాన్ని పరీక్షించేందుకు ఆయన వెంటనే ప్రత్యేక ప్రయోగశాల ఉంటుంది. విదేశాల్లో హోటల్ సిబ్బంది సేవలను ఆయన వినియోగించరు. అన్ని ప్రాంతాలకు రష్యా నుంచే చెఫ్‌లు, హౌస్‌కీపింగ్ సిబ్బందిని తీసుకెళ్తారు. పుతిన్ బస చేసే ప్రాంతాన్ని నెల రోజుల ముందే అత్యాధునిక పరికరాలతో భద్రతా బృందాలు పూర్తిస్థాయిలో తనిఖీ చేస్తాయి. ఆయనతో వచ్చే చెఫ్‌లు కూడా సైనిక శిక్షణ పొందినవారే.

వివరాలు 

విమానంలో జిమ్ - బార్ - వైద్య కేంద్రం 

పుతిన్ ప్రయాణించే విమానం 'ఇల్యుషిన్ ఐఎల్-96-300 పీయూ'. దీన్ని 'ఫ్లైయింగ్ ప్లూటాన్'గా పిలుస్తారు. ఇందులో వ్యాయామశాల (జిమ్), బార్, పూర్తి స్థాయి వైద్య కేంద్రం వంటి సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక విమానం ఒకేసారి 262 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. నాన్‌స్టాప్‌గా 11 వేల కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే వినియోగించేందుకు పుతిన్ వెంట మరో బ్యాకప్ జెట్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది.

Advertisement