Saudi Arabia: హజ్ యాత్రపై కఠిన నియమాలు.. అనుమతి లేనివారికి మక్కాలోకి నో ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
హజ్ యాత్ర నిర్వహణలో క్రమబద్ధత కోసం సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది. ఏప్రిల్ 13 నుంచి అధికారిక అనుమతులు లేని విదేశీ యాత్రికులు, అలాగే దేశంలో నివసిస్తున్న విదేశీ పౌరులు మక్కా నగరంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. యాత్ర సమయంలో అధిక రద్దీ తగ్గించడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పని అనుమతులు, మక్కా నుంచి జారీ చేసిన నివాస గుర్తింపు కార్డు లేదా చెల్లుబాటు అయ్యే హజ్ అనుమతి పత్రాలు లేని వ్యక్తులను నగరంలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. నియమాల అమలుకు తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వివరాలు
ఏప్రిల్ 18 నుంచి చెల్లుబాటు అయ్యే హజ్ వీసాలు ఉన్నవారికే మక్కా ప్రవేశం
ఇక మరోవైపు, ఉమ్రా వీసాలతో వచ్చిన విదేశీ యాత్రికులు ఏప్రిల్ 18 నాటికి దేశాన్ని విడిచి వెళ్లాలని ఆదేశించారు. ఆ తేదీ నుంచి మే 31 వరకు స్థానికులు, గల్ఫ్ సహకార మండలి దేశాల పౌరులు సహా ఎవరికి కూడా ఉమ్రా అనుమతులు ఇవ్వబోమని ప్రకటించారు. ఏప్రిల్ 18 నుంచి చెల్లుబాటు అయ్యే హజ్ వీసాలు ఉన్నవారికే మక్కా ప్రవేశం కల్పిస్తామని తెలిపారు. హజ్ సీజన్‌లో కార్మికులకు అవసరమైన అనుమతులను ఎలక్ట్రానిక్ విధానంలో జారీ చేస్తామని చెప్పారు. నియమాలు ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధిస్తామని అధికారులు హెచ్చరించారు.