Anojan Sivarasa: ఫేస్బుక్ కామెంట్ కేసులో శ్రీలంక యువకుడికి ఊరట.. మరణశిక్ష రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియాలో మరణశిక్షను ఎదుర్కొంటున్న శ్రీలంక వలస కార్మికుడు అనోజన్ శివరాసకు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఊరటనిచ్చింది. ఫేస్బుక్లో ప్రవక్త మహమ్మద్‌ను కించపరిచేలా కామెంట్ చేశారనే ఆరోపణలతో ఆయనకు గతంలో విధించిన మరణశిక్షను సౌదీ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ విషయాన్ని కొలంబో డిప్యూటీ విదేశాంగ మంత్రి అరుణ్ హేమచంద్ర బుధవారం వెల్లడించారు. 27 ఏళ్ల శివరాసకు మరణశిక్ష రద్దు కావడంతో శ్రీలంకలో నెలకొన్న ఆందోళన కొంతవరకు తగ్గింది. ఈ విషయంలో శ్రీలంక ప్రభుత్వం చేసిన దౌత్య ప్రయత్నాలకు సానుకూల ఫలితం లభించినట్లయింది.
వివరాలు
అసలేం జరిగిందంటే?
ఈఏడాది జూన్ నెలాఖరులో సోషల్ మీడియాలో ఓ వీడియో విస్తృతంగా వైరల్ అయింది.
ఆ వీడియోలో హిందూ యాత్రికులను అనుసరిస్తూ వచ్చిన ఓ ముస్లిం యువకుడు కుక్కను తన్నినట్లు కనిపించింది.
ఈ ఘటనపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా చర్చలు జరిపారు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి హిందూ దేవుడిని కించపరిచేలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.
దీనికి స్పందిస్తూ శ్రీలంకకు చెందిన అనోజన్ శివరాస తమిళ భాషలో ప్రవక్త మహమ్మద్‌ను అవమానించేలా కామెంట్ పెట్టాడు.
అయితే,ఆ తర్వాత వెంటనే ఆ వ్యాఖ్యను తొలగించడంతో పాటు క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను కూడా విడుదల చేశాడు.
అయినప్పటికీ, శివరాస చేసిన కామెంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఆయన పనిచేస్తున్న సంస్థ యజమాని,సౌదీ అధికారుల దృష్టికి వెళ్లింది.
వివరాలు
అసలేం జరిగిందంటే?
దీంతో జూలైలో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఇస్లాం మతాన్ని, ప్రవక్త మహమ్మద్‌ను దూషించారనే ఆరోపణలపై సెప్టెంబర్‌లో సౌదీ అప్పీలేట్ కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది.
అంతకుముందు అల్-అహ్సా క్రిమినల్ కోర్టు శివరాసకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 30 లక్షల సౌదీ రియాల్స్ జరిమానా విధించింది.
అయితే, అప్పీల్ విచారణలో ఈ శిక్ష మరణశిక్షగా మారింది.
ఈ తీర్పు శ్రీలంకలో తీవ్ర ఆందోళనకు దారితీసింది. శివరాస ప్రాణాలను కాపాడేందుకు శ్రీలంక ప్రభుత్వం సౌదీ అరేబియా అధికారులతో దౌత్యపరమైన చర్చలను ముమ్మరం చేసింది.
అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్‌తో పాటు ఇతర సంస్థలు కూడా ఈ వ్యవహారంపై స్పందించాయి.
వివరాలు
తదుపరి చర్యలపై ఇంకా స్పష్టత లేదు
వలస కార్మికులపై ఇలాంటి కఠినమైన శిక్షలు విధించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, శివరాస ప్రాణాలను కాపాడాలని ఆయా సంస్థలు విజ్ఞప్తి చేశాయి.
ఈ కేసులో సౌదీ అధికారులతో చర్చలు జరుపుతున్న శ్రీలంక చట్టసభ సభ్యుడు ఫైజర్ ముస్తఫా కూడా సుప్రీంకోర్టు మరణశిక్షను రద్దు చేసిన విషయాన్ని ధృవీకరించారు.
అయితే, న్యాయస్థానం వెలువరించిన తాజా తీర్పుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.
మరణశిక్ష రద్దయినప్పటికీ, శివరాసపై ఇకపై ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు? ఆయన ఎంతకాలం కస్టడీలో ఉండాల్సి వస్తుంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.
వివరాలు
తదుపరి చర్యలపై ఇంకా స్పష్టత లేదు
మరోవైపు, తమ కుమారుడితో సెప్టెంబర్ 28 నుంచి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని శివరాస కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
మరణశిక్ష రద్దు కావడంతో ఆయన ప్రాణాలకు ముప్పు తప్పినందుకు శ్రీలంక ప్రభుత్వ వర్గాలు, దౌత్యవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఈ పరిణామానికి సహకరించిన ఇరు దేశాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.