Loading...
Saudi Arabia: యుద్ధం కొనసాగించాలా? సంయమనం పాటించాలా? సందిగ్ధంలో సౌదీ
యుద్ధం కొనసాగించాలా? సంయమనం పాటించాలా? సందిగ్ధంలో

Saudi Arabia: యుద్ధం కొనసాగించాలా? సంయమనం పాటించాలా? సందిగ్ధంలో సౌదీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 31, 2026
08:46 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా చర్యలు కొనసాగుతుండగా, వాషింగ్టన్‌కు మద్దతుగా ఉన్న గల్ఫ్ దేశాలపై టెహ్రాన్ అనుబంధ శక్తులు దాడులు ముమ్మరం చేస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య పశ్చిమాసియాలో అతిపెద్ద ఆర్థిక శక్తిగా గుర్తింపు పొందిన సౌదీ అరేబియా కీలక నిర్ణయం ముందు నిలిచింది. తమపై జరుగుతున్న దాడులకు ప్రతిదాడులు కొనసాగించాలా, లేక ఉద్రిక్తతలు మరింత పెరగకుండా దౌత్యపరమైన మార్గాన్నే అనుసరించాలా అనే అంశంపై రియాధ్ తీవ్ర ఆలోచనలో పడింది.

వివరాలు 

అమెరికాతో కలిసి..

అమెరికా-ఇరాన్ ఘర్షణల ప్రభావాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్న దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి.

యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలోనే టెహ్రాన్ నుంచి డ్రోన్లు,క్షిపణుల దాడులు ఎదురయ్యాయి.

మరోవైపు యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులు గత కొంతకాలంగా సౌదీ లక్ష్యాలపై దాడులను మరింత ఉద్ధృతం చేశారు.

ఇటీవల ఇరాక్‌లో ఇరాన్ మద్దతు ఉన్న మిలీషియా గ్రూపులు కూడా డ్రోన్లతో సౌదీపై దాడులు ప్రారంభించాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో రియాధ్ అమెరికాతో కలిసి ఇరాక్‌లోని ఆ మిలీషియా స్థావరాలపై ఈ వారం దాడులు చేపట్టింది.

అయితే ఇక్కడితో ప్రతిదాడులను కొనసాగించాలా,లేక పరిస్థితిని మరింత ఉద్రిక్తం కాకుండా దౌత్యపరంగా పరిష్కరించేందుకు ప్రయత్నించాలా అనే అంశంపై సౌదీ ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతోంది.

దీనికి ప్రధాన కారణంగా'విజన్ 2030'ప్రణాళిక నిలుస్తోంది.

వివరాలు 

యువరాజు కల చెదిరిపోవద్దని!

ప్రపంచంలో అత్యధిక చమురు సంపద కలిగిన దేశాల్లో సౌదీ అరేబియా ఒకటి.

అయినప్పటికీ దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ ప్రధానంగా చమురు ఆదాయంపైనే ఆధారపడుతోంది.

ఈ పరిస్థితిని మార్చేందుకు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రతిష్ఠాత్మకంగా 'విజన్ 2030' కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు.

ఈ ప్రణాళికలో భాగంగా చమురుపై ఆధారాన్ని తగ్గించి, విభిన్న పరిశ్రమలను అభివృద్ధి చేయడం, ప్రతి ఏడాది లక్షలాది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం,భారీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం,అత్యాధునిక డేటా సెంటర్లు సహా ఆధునిక మౌలిక వసతులను ఏర్పాటు చేయడం వంటి లక్ష్యాలు ఉన్నాయి.

ప్రస్తుతం ప్రతిదాడులను మరింత విస్తరిస్తే యుద్ధంలో పూర్తిస్థాయిలో భాగస్వామిగా మారాల్సి వస్తుందనే ఆందోళన సౌదీలో వ్యక్తమవుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

హర్మూజ్ పరిస్థితులతో పాటు ఎర్ర సముద్రంలోనూ సవాళ్లు

అలాంటి పరిస్థితి ఏర్పడితే 'విజన్ 2030' అమలుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

మరోవైపు ఎలాంటి ప్రతిస్పందన ఇవ్వకుండా సంయమనం పాటిస్తే శత్రు వర్గాలు మరింత దూకుడుగా వ్యవహరించే ప్రమాదం ఉందనే భయం కూడా రియాధ్‌ను వెంటాడుతోంది.

యుద్ధ ప్రభావంతో హర్మూజ్ జలసంధి కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతినడం సౌదీ చమురు ఎగుమతులపై ప్రభావం చూపుతోంది.

అయితే తూర్పు-పశ్చిమ పైప్‌లైన్ ద్వారా రోజుకు సుమారు 50 లక్షల బ్యారెళ్ల చమురును ఎర్ర సముద్ర తీరంలోని టెర్మినల్‌కు తరలిస్తూ, అక్కడి నుంచి ఎగుమతులను కొనసాగిస్తోంది.

అయితే ఈ నెల 31న యెమెన్ రాజధాని సనాలోని విమానాశ్రయంపై సౌదీ దాడులు జరపడంతో హూతీ తిరుగుబాటుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT

వివరాలు 

అత్యంత అప్రమత్తంగా అడుగులు వేస్తున్న రియాధ్

ప్రతీకార చర్యల్లో భాగంగా ఎర్ర సముద్రంలో సౌదీకి చెందిన నౌకల రాకపోకలను అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ పరిస్థితుల్లో సౌదీ మరింత దూకుడుగా సైనిక చర్యలు చేపడితే హూతీలు, ఇరాన్ మద్దతు ఉన్న ఇరాకీ మిలీషియాలు మరిన్ని దాడులకు పాల్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ముఖ్యంగా చమురు ఉత్పత్తి కేంద్రాలు, పైప్‌లైన్లు, ఇతర కీలక మౌలిక వసతులు లక్ష్యంగా మారే ప్రమాదం ఉండటంతో రియాధ్ అత్యంత అప్రమత్తంగా అడుగులు వేస్తోంది.

భద్రతను కాపాడుకోవడంతో పాటు ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను దెబ్బతిననివ్వకుండా సమతుల్య నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు సౌదీ అరేబియాకు అతిపెద్ద సవాలుగా మారింది.

ADVERTISEMENT