Saudi Arabia: మక్కా సమీపంలో హూతీల డ్రోన్.. కూల్చివేసిన సౌదీ అరేబియా
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం సౌదీ అరేబియాలోని ముస్లింల పవిత్ర నగరం మక్కా సమీపానికీ చేరింది. నగరం వద్దకు దూసుకొచ్చిన ఓ డ్రోన్‌ను కూల్చివేసినట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. ఈ దాడి హూతీ తిరుగుబాటుదారుల పనేనని సౌదీ ఆరోపించగా.. ఆ వాదనను హూతీలు ఖండించారు. సౌదీ అరేబియా పశ్చిమ తీరంపై హూతీ తిరుగుబాటుదారులు బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేయడంతో మక్కా, జెడ్డా, తైఫ్ నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. మక్కా, దాని పరిసర ప్రాంతాల్లో ఇలాంటి భద్రతా హెచ్చరికలు జారీ చేయడం ఇదే తొలిసారి. మక్కా సమీపంలోని నిషేధిత గగనతలంలోకి డ్రోన్ ప్రవేశించకముందే రాయల్ సౌదీ ఎయిర్ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకుని నిర్వీర్యం చేశాయని సైనిక ఉన్నతాధికారి తుర్కి అల్ మాలికి వెల్లడించారు.
వివరాలు
ఇది హేయమైన దాడి: ఓఐసీ
2017లోనూ హూతీలు మక్కాను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
పవిత్ర నగరం మక్కాను హూతీలు లక్ష్యంగా చేసుకోవడం హేయమైన చర్య అని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) ఖండించింది.
సౌదీ అరేబియాపై జరుగుతున్న దాడులను దురాక్రమణగా అభివర్ణించింది.
అయితే, తమపై వస్తున్న ఆరోపణలను హూతీలు తిరస్కరించారు. మక్కాతోపాటు ఇతర పవిత్ర స్థలాలకు తమ నుంచి ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు.
వివరాలు
కీలక ద్వీపాలపై హూతీల పట్టు
ఇదిలా ఉంటే.. ఎర్ర సముద్రానికి దక్షిణాన ఉన్న మరికొన్ని కీలక ద్వీపాలను హూతీ తిరుగుబాటుదారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
బాబ్ ఎల్ మండెబ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్న హూతీలకు ఇది మరో విజయమని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ పరిణామాల మధ్య మదీనాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు నిలిపివేసినట్లు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది.
హూతీల ముప్పు నేపథ్యంలో అప్రమత్తమైన సౌదీ అరేబియా.. ఈజిప్టు, గల్ఫ్ దేశాల సాయాన్ని కోరినట్లు తెలుస్తోంది.
ప్రధాని మొహమ్మద్ బిన్ సల్మాన్.. అమెరికా సైన్యం సాయంతో ఇజ్రాయెల్‌తో పరోక్ష చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సౌదీ కీలక ప్రకటన
A warning has been issued by the National Early Warning Platform in Mecca City to alert of a potential danger. Please follow the instructions below: pic.twitter.com/IwvWhhKMan
— الدفاع المدني السعودي (@SaudiDCD) September 15, 2026