Saudi Arabia: సౌదీ చమురు దిగ్గజం అరామ్కో ప్రధాన కార్యాలయంపై హూతీల బాలిస్టిక్ క్షిపణి దాడి..
ఈ వార్తాకథనం ఏంటి
సౌదీ అరేబియాలో హూతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ధహ్రాన్ నగరంలోని ప్రపంచ చమురు దిగ్గజం అరామ్కో ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని హూతీలు బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసినట్లు సమాచారం. మరోవైపు, రాజధాని రియాద్‌లో క్షిపణులను అడ్డుకునే క్రమంలో వాటి శకలాలు కిందపడటంతో నలుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు, ఒక చిన్నారి ఉన్నారు. ఈ ఘటనలో 15 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దేశంలోని కీలక ప్రాంతాలపై వరుసగా దాడులు జరుగుతుండటంతో సౌదీ అరేబియాలో భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్నాయి.
వివరాలు
ఇంటర్సెప్టర్ల శకలాలు నేలపై పడటంతో దెబ్బతింటున్న ఇళ్ళు
యెమెన్‌కు చెందిన హూతీ తిరుగుబాటుదారులు, సౌదీ అరేబియా మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
హూతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగుతుండటంతో సౌదీ బలగాలు వాటిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రయోగిస్తున్న క్షిపణి నిరోధక వ్యవస్థల ఇంటర్సెప్టర్ల శకలాలు నేలపై పడటంతో ఇళ్లు దెబ్బతింటున్నాయి.
ప్రపంచంలోని అతిపెద్ద చమురు సంస్థల్లో ఒకటైన అరామ్కో.. చమురు ఉత్పత్తి, శుద్ధి, ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది.
అలాంటి సంస్థ ప్రధాన కార్యాలయంపై దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అయితే, ఈ ఘటన కారణంగా సంస్థ కార్యకలాపాలకు ఎంతమేర నష్టం వాటిల్లిందనే వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
వివరాలు
యెమెన్ ఇంధన కేంద్రంపై సౌదీ దాడి
మరోవైపు, యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారులకు చెందిన కీలక ఇంధన నిల్వ కేంద్రంపై సౌదీ అరేబియా దాడి చేసింది.
రాజధాని సనా శివార్లలో ఉన్న అల్-సబాహా కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ దాడి నిర్వహించింది.
సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాల ప్రకారం.. సౌదీలోని విమానాశ్రయాలు, ఇంధన సముదాయాలపై దాడులు చేసేందుకు హూతీలు ఈ కేంద్రాన్ని ఉపయోగిస్తున్నారు.
ఈ కేంద్రంలో సుమారు 58 వేల టన్నుల ఇంధనాన్ని నిల్వ చేసే సామర్థ్యం ఉంది.
సౌదీ జరిపిన దాడిలో ఇద్దరు పౌరులు మరణించగా, మరో ఇద్దరు గాయపడినట్లు హూతీలు వెల్లడించారు.
ఇరుపక్షాల నుంచి వరుసగా దాడులు జరుగుతుండటంతో హూతీ తిరుగుబాటుదారులు, సౌదీ బలగాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.