Pakistan: కరాచీ సముద్ర తీరంలో కనిపించకుండా పోయిన బోయింగ్ 737.. కొనసాగుతున్న గాలింపు
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ దక్షిణాన ఉన్న కరాచీ సముద్ర తీరంలో ఓ కార్గో విమానం అదృశ్యమవడంతో విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు పాకిస్థాన్ విమానయాన అధికారులు తెలిపారు. సంయుక్త అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా నుంచి కరాచీకి బయలుదేరిన బోయింగ్ 737 కార్గో విమానం మంగళవారం రాత్రి స్థానిక కాలమానం ప్రకారం 9:21 గంటలకు (GMT 16:21) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లతో సంబంధాలు కోల్పోయింది. అంతకు ముందు విమానం వేగంగా ఎత్తు తగ్గించినట్లు పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వెల్లడించింది.
వివరాలు
కార్గో రవాణా సేవలను అందిస్తున్న కే2 ఎయిర్వేస్
విమానం ఎత్తు తగ్గడం ప్రారంభించే కొద్ది నిమిషాల ముందు నావిగేషన్ వ్యవస్థలో సమస్య ఏర్పడిందని పైలట్లు సమాచారమిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత విమానంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని పేర్కొన్నారు. ఈ కార్గో విమానాన్ని కరాచీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ సంస్థ కే2 ఎయిర్వేస్ నిర్వహిస్తోంది. 2018లో స్థాపించబడిన ఈ సంస్థ కార్గో రవాణా సేవలను అందిస్తోంది. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో విమానంలోని ఐదుగురు సిబ్బంది వివరాలను కే2 ఎయిర్వేస్ వెల్లడించింది. పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీతో పాటు ఇతర ప్రభుత్వ సంస్థలతో పూర్తిగా సహకరిస్తున్నామని సంస్థ తెలిపింది. తమ సహచరులు సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నామని పేర్కొంది.
వివరాలు
ముమ్మరంగా గాలింపు చర్యలు
ఫ్లైట్ ట్రాకింగ్ వేదిక Flightradar24 విడుదల చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానం అదృశ్యమయ్యే ముందు ఎత్తులో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. అనంతరం ఒక్కసారిగా వేగంగా దిగివచ్చినట్లు డేటా సూచిస్తోంది. అదృశ్యమైన విమానం కోసం పాకిస్థాన్ నౌకాదళం, వైమానిక దళం సహా పలు ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. సముద్ర ప్రాంతంలో విస్తృతంగా శోధన కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, పాకిస్థాన్‌లో చివరిసారిగా 2020లో పెద్ద విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అప్పట్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు చేరువలో ఉన్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం కూలిపోవడంతో 99 మందిలో ఇద్దరు మినహా మిగిలిన వారంతా ప్రాణాలు కోల్పోయారు.