
US: ట్రంప్ విధానాలను నిరసిస్తూ సెనేట్ 25 గంటల పాటు ప్రసంగం..డెమోక్రటిక్ సెనేటర్ రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు దేశీయంగా కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ముఖ్యంగా డెమోక్రాట్లు ఆయన (Donald Trump) విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఈ పరిణామాల మధ్య, ఇటీవల ఓ ప్రతిపక్ష సెనెటర్ అరుదైన ఘనత సాధించారు.
అధ్యక్షుడి విధానాలకు వ్యతిరేకంగా నిలిచి, నిరంతరాయంగా 25 గంటల పాటు ప్రసంగించి చరిత్ర సృష్టించారు.
ఈ ఘనతతో సెనెట్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ ప్రసంగం (Cory Booker Senate Speech) చేసిన సభ్యుడిగా అరుదైన రికార్డును నమోదు చేశారు.
వివరాలు
సెనెట్ చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘ ప్రసంగం
ఈ అరుదైన ఫీట్‌ను న్యూజెర్సీ సెనెటర్, డెమోక్రటిక్ పార్టీ నేత కోరీ బుకర్ సాధించారు.
అమెరికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం సెనెట్ ఫ్లోర్‌లోకి ప్రవేశించిన 55 ఏళ్ల ఈ నేత, ప్రసంగాన్ని ప్రారంభించి రాత్రంతా కొనసాగించారు.
మంగళవారం సాయంత్రం వరకు ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించగా,మొత్తంగా 25 గంటల 5 నిమిషాల పాటు మాట్లాడారు.
సెనెట్ చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘ ప్రసంగంగా నిలిచింది.
ఈ సందర్భంగా, 1957లో పౌరహక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ రిపబ్లికన్ నేత స్ట్రోమ్ థర్మోండ్ ఇచ్చిన ప్రసంగం రికార్డును కోరీ బుకర్ అధిగమించారు.