US Storm: అమెరికాలో భీకర తుఫాను.. 34 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికాను భీకర తుఫాను వణికించింది. తీవ్రమైన గాలులతో విరుచుకుపడి అనేక ఇళ్లను నేలమట్టం చేసింది.
ఈ తుఫాను ప్రభావంతో ఇప్పటివరకు 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. టోర్నడోల ధాటికి కొన్ని ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి.
షెర్మాన్ కౌంటీలో దుమ్ము తుఫాను కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 29 మంది గాయపడినట్లు వెల్లడించారు.
ఈ ప్రకృతి విపత్తుతో పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి.
Details
వందకు పైగా అడవుల్లో మంటలు
టెక్సాస్ పాన్‌హ్యాండిల్‌లోని అమరిల్లో ప్రాంతంలో దుమ్ము తుఫాను కారణంగా కారు ప్రమాదాల్లో ముగ్గురు మరణించినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు.
అమెరికా వ్యాప్తంగా బలమైన గాలుల ప్రభావం వల్ల అనేక ప్రాంతాల్లో మరణాలు సంభవించాయి. అంతేకాకుండా 100కి పైగా అడవుల్లో మంటలు చెలరేగినట్లు సమాచారం.
జాతీయ వాతావరణ సేవ ప్రకారం, మిన్నెసోటా పశ్చిమ ప్రాంతాలు, దక్షిణ డకోటా తూర్పు ప్రాంతాలకు మంచు తుఫాను హెచ్చరిక జారీ అయింది.
3 నుంచి 6 అంగుళాల వరకు మంచు పేరుకుపోయే అవకాశమున్నట్లు పేర్కొంది.
శనివారం కూడా భారీ టోర్నడోలు సంభవించాయి. తూర్పు లూసియానా, మిస్సిస్సిప్పి, అలబామా, పశ్చిమ జార్జియా, ఫ్లోరిడా పాన్‌హ్యాండిల్ ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.