Sheikh Hasina: ప్రజల కోసం బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా.. ఎలాంటి పరిణామాలకైనా సిద్ధం: షేక్ హసీనా
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. తనను అరెస్టు చేసినా, జైలుకు పంపినా, చంపేందుకు ప్రయత్నించినా తాను తప్పకుండా బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉంటున్న ఆమె, బంగ్లాదేశ్ విడిచి వచ్చిన తర్వాత తొలిసారిగా వర్చువల్‌గా మీడియాతో మాట్లాడారు. తన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, అలాగే బంగ్లాదేశ్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో తాను విదేశాల్లో ఉండలేనని హసీనా అన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజల మధ్యకే వస్తానని చెప్పారు. ఈ ఏడాది డిసెంబరులో స్వదేశానికి తిరిగి రావాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
వ్యక్తిగత భద్రత కంటే ప్రజాసేవకే ప్రాధాన్యం
తిరిగి వెళ్లిన తర్వాత ఎదురయ్యే ప్రమాదాల గురించి తనకు పూర్తిగా తెలుసని హసీనా పేర్కొన్నారు.
తనను చంపేందుకు ప్రయత్నించవచ్చని, అరెస్టు చేసి జైలుకు పంపవచ్చని, రాజకీయ కక్షతో తప్పుడు కేసులు పెట్టవచ్చని అన్నారు.
అయినప్పటికీ ప్రజల పట్ల తన బాధ్యతను భయం మార్చలేదని స్పష్టం చేశారు.
వ్యక్తిగత భద్రత కంటే ప్రజాసేవకే తాను ఎప్పుడో ప్రాధాన్యం ఇచ్చానని వ్యాఖ్యానించారు.
తన రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను కూడా హసీనా గుర్తు చేసుకున్నారు.
1971లో తన తల్లితో కలిసి జైలులో ఉన్నానని, ఆ సమయంలోనే తన కుమారుడు సజీబ్ వాజెద్ జోయ్ జన్మించాడని చెప్పారు.
1975లో తన కుటుంబ సభ్యులను కోల్పోయానని, ఆ తర్వాత ఆరు సంవత్సరాలు ప్రవాస జీవితాన్ని గడిపిన విషయాన్ని గుర్తుచేశారు.
వివరాలు
2024 నుండి భారత్‌లో హసీనా
తాను బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలనుకోవడానికి ఒకే కారణమని, అదే ప్రజల పక్కన నిలబడి వారి జీవితాలు మెరుగుపడేలా పని చేయడమేనని హసీనా తెలిపారు.
ఈ సందర్భంగా తన పార్టీ అవామీ లీగ్ పై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు.
పార్టీ నాయకులను విడుదల చేయడంతో పాటు,పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసులను కూడా ఉపసంహరించుకోవాలని కోరారు.
బంగ్లాదేశ్‌లో ఆమె దేశం విడిచి వెళ్లిన తర్వాత ఏర్పడిన రాజకీయ పరిణామాల మధ్య హసీనా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
పలుమార్లు బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా పనిచేసిన షేక్ హసీనా, 2024లో భారీ నిరసనలు, అల్లర్ల నేపథ్యంలో ప్రభుత్వం కూలిపోవడంతో ఢాకా విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు.