Sheikh Hasina: షేక్ హసీనాకు శిక్ష తప్పదు.. స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న అంశంపై ఆ దేశ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దోషిగా తేలిన హసీనాను భారత్ నుంచి స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే న్యూదిల్లీకి పలుమార్లు విజ్ఞప్తి లేఖలు పంపినట్లు తెలిపారు. భారత్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాధానం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. హసీనాను స్వదేశానికి తీసుకొస్తాం 'నా దృష్టిలో షేక్ హసీనా ఒక నేరస్థురాలు. మా ట్రైబ్యునల్ ఆమెను దోషిగా నిర్ధారించింది. బంగ్లాదేశ్ ప్రజల్లోనూ ఆమెకు ఇదే గుర్తింపు ఉంది. హసీనాను ఎప్పటికైనా, ఎలాగైనా బంగ్లాదేశ్‌కు తీసుకువస్తాం. ఆమెకు తగిన శిక్ష విధిస్తామని అసదుజ్జమాన్ స్పష్టం చేశారు.
వివరాలు
చట్ట ప్రకారమే చర్యలు
అయితే, హసీనా మరో దేశంలో ఉన్నందున ఈ వ్యవహారంలో న్యాయశాఖకు ప్రత్యక్ష ప్రమేయం ఉండదని మంత్రి తెలిపారు.
ఈ అంశాన్ని హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోందని వివరించారు.
ఒకవేళ భారత్ ఆమెను బంగ్లాదేశ్‌కు అప్పగిస్తే ఎలాంటి భావోద్వేగాలకు తావివ్వకుండా చట్టప్రకారం వ్యవహరిస్తామని పేర్కొన్నారు.
నిబంధనలను ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలు తీసుకోబోమని అసదుజ్జమాన్ వెల్లడించారు.