Strait of Hormuz: హర్మూజ్ దాటామని చివరి కాల్.. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి సమీపంలో ఒమన్ తీరానికి దగ్గరగా ప్రయాణిస్తున్న జీఎఫ్‌ఎస్ గెలాక్సీ అనే వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో గల్లంతైన భారతీయ నావికుడు హేరంభ్ కర్మర్కర్ మృతిచెందారు. ఈ విషాద వార్తతో ఆయన కుటుంబంలో తీవ్ర శోకం నెలకొంది. దాడికి కొద్దిసేపటి ముందే ఫోన్ చేసి తమ నౌక సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటిందని చెప్పాడని, చివరకు ఇలాంటి దుర్ఘటన చోటుచేసుకోవడం బాధాకరమని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సైప్రస్ జెండాతో ప్రయాణిస్తున్న ఈ వాణిజ్య నౌకపై ఆదివారం ఇరాన్ దాడి చేసింది. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉండగా, వారిలో 11 మంది భారతీయులు ఉన్నారు.
వివరాలు
హేరంభ్ నౌకలోని ఇంజిన్ రూమ్ వద్ద విధులు
దాడి అనంతరం సిబ్బందిలో ఎక్కువ మంది లైఫ్‌బోట్ల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు.
అయితే, ఘటన సమయంలో హేరంభ్ నౌకలోని ఇంజిన్ రూమ్ వద్ద విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
దాడి తర్వాత ఆయన ఆచూకీ లభించకపోవడంతో గల్లంతైనట్లు ప్రకటించగా, అనంతరం ఆయన మృతిచెందినట్లు నిర్ధారణ అయింది.
మహారాష్ట్రలోని పుణెకు చెందిన హేరంభ్ కర్మర్కర్ దాడి జరగడానికి కొన్ని నిమిషాల ముందే తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
వివరాలు
ఆ తర్వాత జరిగిన దాడితో విషాదంలోకి కుటుంబం
తమ నౌక ఎలాంటి ప్రమాదం లేకుండా హర్మూజ్ జలసంధిని దాటిందని చెప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే, ఆ తర్వాత జరిగిన దాడి వారి కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఈ వాణిజ్య నౌక గత మూడు నెలలుగా హర్మూజ్ జలసంధి సమీపంలోనే నిలిచిపోయింది.
చాలకాలం తర్వాత స్వగ్రామానికి తిరిగి వెళ్లబోతున్నానన్న ఆనందంలో ఉన్న హేరంభ్, చివరకు అనూహ్యంగా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.