Aiko: యువరాణి అయికోకు షాక్.. జపాన్ సింహాసనంపై చెక్ పెట్టిన కొత్త చట్టం!
ఈ వార్తాకథనం ఏంటి
జపాన్ పార్లమెంట్ చక్రవర్తి వారసత్వానికి సంబంధించిన ఇంపీరియల్ హౌస్ చట్టంలో కీలక సవరణకు శుక్రవారం ఆమోదం తెలిపింది. అయితే శతాబ్దాలుగా కొనసాగుతున్న మగవారే చక్రవర్తులుగా ఉండాలనే సంప్రదాయాన్ని మాత్రం యథాతథంగా కొనసాగించింది. దీంతో ప్రస్తుత చక్రవర్తి నరుహిటో కుమార్తె, ప్రజాదరణ పొందిన 24 ఏళ్ల యువరాణి అయికో తదుపరి చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలకు తెరపడింది. 19వ శతాబ్దంలో రూపొందించిన ఇంపీరియల్ హౌస్ చట్టంలో తీసుకొచ్చిన ఈ తాజా సవరణ ప్రకారం రాజవంశంలో తండ్రి వంశపారంపర్య రక్తసంబంధం కలిగిన పురుషులకే చక్రవర్తి అయ్యే అర్హత ఉంటుంది.
వివరాలు
మహిళలకు సింహాసన వారసత్వ హక్కు కల్పించలేదు
మహిళలకు సింహాసన వారసత్వ హక్కు కల్పించలేదు. అంతేకాకుండా రాజవంశానికి దూరపు రక్తసంబంధం కలిగిన పురుషులను దత్తత తీసుకుని, వారి సంతానాన్ని భవిష్యత్ వారసులుగా తీర్చిదిద్దేందుకు కూడా ఈ సవరణ అవకాశం కల్పిస్తోంది.
ప్రస్తుతం జపాన్ చక్రవర్తి నరుహిటోకు కుమారుడు లేరు. ఆయనకు ఒక్క కుమార్తె అయిన యువరాణి అయికో మాత్రమే ఉన్నారు.
ఆమె ప్రజల్లో విశేష ఆదరణ పొందడంతో తదుపరి చక్రవర్తిగా ఆమెనే నియమించాలని చాలామంది కోరుకున్నారు.
అయితే తాజా చట్ట సవరణతో ఆ అవకాశానికి ముగింపు పలికింది. ఈ నిర్ణయం ప్రకారం, నరుహిటో తమ్ముడు, 60 ఏళ్ల అకిషినోనే జపాన్ సింహాసనానికి తదుపరి వారసుడిగా కొనసాగనున్నారు.