Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి, 16 మందికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
పోలాండ్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. క్రాకోవ్ (Krakow) నగరంలో ఓ వ్యక్తి తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. సిటీ సెంటర్‌లోకి కారులో వచ్చిన అతడు.. వాహనం నుంచే ప్రజలపైకి కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ బ్రిటిష్ పౌరుడు, ముగ్గురు పోలాండ్‌కు చెందిన స్థానికులు ఉన్నారు. మరో ఇద్దరి వివరాలను గుర్తించాల్సి ఉంది. గాయపడిన వారిలో బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రియా, పోర్చుగల్, రష్యా దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్లు సమాచారం.
వివరాలు
మిలిటరీ తరహా దుస్తుల్లో వచ్చి కాల్పులు
కాల్పులకు పాల్పడిన వ్యక్తి వయసు సుమారు 25 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు.
మిలిటరీ తరహా దుస్తులు ధరించి వచ్చిన అతడు.. దాడికి సైనిక అవసరాల కోసం ఉపయోగించే ఆయుధాన్ని వినియోగించినట్లు తెలుస్తోంది.
అతడి వాహనంలో మరిన్ని ఆయుధాలను కూడా గుర్తించారు.
అనుమానితుడు తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైనట్లు పోలాండ్ మంత్రి ఒకరు వెల్లడించారు. అతడికి అతివాద సిద్ధాంతాల పట్ల ఆసక్తి ఉన్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
వివరాలు
అనుమానితుడి ఇంట్లో మరో ముగ్గురి మృతదేహాలు
మరోవైపు, అనుమానితుడి ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. ఈ విషయాన్ని పోలాండ్ ప్రధాని డోనాల్డ్ టస్క్ వెల్లడించారు.
అతడి గదిలో మరో ముగ్గురి మృతదేహాలను గుర్తించినట్లు తెలిపారు. ఆ ముగ్గురూ అనుమానితుడి కుటుంబ సభ్యులై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
పోలాండ్‌లో సామూహిక కాల్పుల ఘటనలు అత్యంత అరుదుగా జరుగుతుంటాయి.
అలాంటి దేశంలో క్రాకోవ్‌లోని ప్రధాన మార్కెట్ స్క్వేర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది.