LOADING...
Australia: సిడ్నీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి
సిడ్నీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి

Australia: సిడ్నీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 14, 2025
02:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం బాండి బీచ్‌లో ఆదివారం సాయంత్రం 6.30 గంటల సమయంలో (స్థానిక కాలమానం ప్రకారం) భయానక కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది. పర్యాటకులు ఉల్లాసంగా విహరిస్తున్న వేళ బీచ్‌లోకి చొరబడిన ఇద్దరు గన్‌మెన్లు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించడంతో అక్కడ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, నల్లటి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు షాట్‌గన్స్‌తో సర్ఫ్‌ క్లబ్‌కు సమీపంలో ఉన్న పాదచారుల వంతెనపైకి చేరుకుని కాల్పులు జరిపారు.

Details

ఓ ఈవెంట్ ను లక్ష్యం చేసుకొని దాడులు

అక్కడ జరుగుతున్న ఓ ఈవెంట్‌ను లక్ష్యంగా చేసుకునే ఈ దాడి జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందినట్లు ఆస్ట్రేలియా మీడియా సంస్థలు వెల్లడించాయి. సమాచారం అందుకున్న వెంటనే భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ఒక దుండగుడిని కాల్చి చంపగా, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడిలో గాయపడిన వారిని కాపాడేందుకు హెలికాప్టర్లు, 30 అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి పంపించారు. ప్రస్తుతం పరిస్థితిపై అధికారులు నిఘా కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న వీడియో

Advertisement