Silicon Valley Whisper Network: సిలికాన్ వ్యాలీలో 'విస్పర్ నెట్‌వర్క్'.. 100 మందికిపైగా పేర్లతో రహస్య జాబితా
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ టెక్నాలజీ, స్టార్టప్ రంగాలకు కేంద్రంగా ఉన్న అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. టెక్ దిగ్గజాలు, పెట్టుబడిదారుల నుంచి ఎదురైన చేదు అనుభవాలపై పలువురు మహిళలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ప్రముఖులుగా చలామణీ అవుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల పేర్లతో కూడిన ఓ రహస్య స్ప్రెడ్‌షీట్ వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ జాబితాలో 100 మందికిపైగా ప్రముఖుల పేర్లు ఉన్నట్లు సమాచారం. సిలికాన్ వ్యాలీలోని మహిళలు తమ భద్రత కోసం రహస్యంగా 'విస్పర్ నెట్‌వర్క్' (Whisper Network) పేరుతో ఈ సమాచారాన్ని నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
వివరాలు
ఫిర్యాదు చేస్తే.. కెరీర్‌కు ముప్పు?
లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల గురించి ఒకరికొకరు ముందుగానే సమాచారం అందించుకోవడమే ఈ నెట్‌వర్క్ ఉద్దేశంగా తెలుస్తోంది.
మత్తుమందులు ఇవ్వడం, లైంగిక దాడి, అత్యాచారం వంటి తీవ్రమైన ఆరోపణలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు కథనాలు వెల్లడించాయి.
లైంగిక వేధింపుల గురించి పోలీసులకు ఫిర్యాదు చేసినా, లేదా బహిరంగంగా మాట్లాడినా తమ కెరీర్ దెబ్బతింటుందనే భయంతో కొందరు మహిళలు ముందుకు రావడం లేదని ఈ కథనం పేర్కొంది.
దీంతో తమకు ఎదురైన అనుభవాలను ఇతర మహిళలతో రహస్యంగా పంచుకోవడం, ప్రమాదకర వ్యక్తుల గురించి ముందుగానే హెచ్చరించడం కోసం 'విస్పర్ నెట్‌వర్క్'ను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.
వివరాలు
'హ్యాకర్ హౌస్'ల్లోనూ..
సిలికాన్ వ్యాలీలో ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు కలిసి నివసించే 'హ్యాకర్ హౌస్'లు, అలాగే టెక్ పార్టీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నట్లు అమెరికా మీడియా కథనం పేర్కొంది.
టెక్ పరిశ్రమలో పరిచయాలు, అవకాశాలు, పెట్టుబడుల కోసం జరిగే సమావేశాలు, పార్టీల నేపథ్యంలో మహిళలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు ఈ వ్యవహారంతో మరోసారి చర్చకు వచ్చాయి.