Nepal: నేపాల్‌లో ఆరుగురు భారత ట్రెక్కర్లు అదృశ్యం.. భారీ హిమపాతంతో ఆందోళన!
ఈ వార్తాకథనం ఏంటి
నేపాల్‌లో కురుస్తున్న భారీ హిమపాతం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన షే ఫోక్సుండో సరస్సును సందర్శించేందుకు ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఆరుగురు భారతీయులు అదృశ్యమయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. భారీగా మంచు కురుస్తుండటంతో వారి ఆచూకీ గుర్తించడం కష్టంగా మారింది. దీంతో వారిని గుర్తించేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
వివరాలు
నుమ్లా, బగ్లా పాస్ ప్రాంతాల్లో చివరిసారిగా గుర్తింపు
అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. ఆరుగురు భారతీయ పర్యాటకులు డోల్పో బుద్ధ గ్రామీణ మున్సిపాలిటీలోని 4, 8 వార్డుల నుంచి షే ఫోక్సుండో సరస్సు వైపు ప్రయాణమయ్యారు.
షే ఫోక్సుండో గ్రామీణ మున్సిపాలిటీలోని 4, 8 వార్డుల మధ్య ఉన్న నుమ్లా పాస్, బగ్లా పాస్ ప్రాంతాల్లో వారు చివరిసారిగా కనిపించినట్లు సమాచారం.
అప్పటి నుంచి వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదు.
వివరాలు
మంచులో చిక్కుకుపోయారా?
ఎత్తైన పర్వత ప్రాంతాల నుంచి తిరిగి వస్తున్న సమయంలో పర్యాటకులు భారీగా పేరుకుపోయిన మంచులో చిక్కుకుపోయి ఉండవచ్చని స్థానిక గైడ్లు అనుమానిస్తున్నారు.
ఈ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం, పర్వత మార్గాల్లో ఎదురయ్యే కఠిన పరిస్థితుల గురించి స్థానికులు ముందుగానే హెచ్చరించినట్లు తెలుస్తోంది.
అయినప్పటికీ పర్యాటకులు తమ ప్రయాణాన్ని కొనసాగించినట్లు సమాచారం.
వివరాలు
గాలింపు చర్యలకు వాతావరణం ఆటంకం
అదృశ్యమైన ఆరుగురు భారతీయుల కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే భారీ హిమపాతం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా గాలింపు బృందాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీనికి తోడు పర్వత ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో లేకపోవడం కూడా ఆచూకీ గుర్తించే ప్రయత్నాలకు ఆటంకంగా మారింది.
ప్రస్తుతం ఆరుగురు భారతీయుల ఆచూకీ కోసం అధికారులు, సహాయక బృందాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. వారి పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.