Russia-Ukrain War: ఉక్రెయిన్ పై రష్యా దాడి...ఎనిమిది మంది మృతి
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం చల్లారలేదు. రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. తాజాగా ఉక్రెయిన్ పై రష్యా శుక్రవారం అర్థరాత్రి నుంచి క్షిపణులతో విరుచుకుపడింది. ఉక్రెయిన్ లో రెండో అతి పెద్ద నగరం ఖర్కీవ్ పై రష్యా క్షిపణులు, డ్రోన్ల తో దాడి చేసింది. ఈ దాడిలో ఎనిమిది మృతి చెందగా 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇరాన్ తయారు చేసిన షహీద్ డ్రోన్లను, ఆరు క్షిపణులతో రష్యా ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. కాగా, అందులో 3 క్రూయిజ్ మిస్సైళ్లను, 28 డ్రోన్లను ఉక్రెయిన్ కూల్చివేసింది. అయితే రష్యా చేసిన దాడులకు సంబంధించి ఆ దేశం అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, ఉక్రెయిన్ మాత్రం రష్యా దాడి విషయాలను అధికారికంగా వెల్లడించింది.
సహాయక చర్యలు ప్రారంభించిన ఖర్కీవ్ అధికారులు
షెవ్ చెంకీవ్ స్కీ జిల్లాలో శనివారం జరిగిన క్షిపణిదాడిలో ఆరుగురు మరణించారని, పదిమంది గాయపడ్డారని ఖార్కీవ్ మేయర్ ఇహోర్ తెరెఖోవ్ వెల్లడించారు. శనివారం అర్థరాత్రి దాటాక మృతుల సంఖ్య మరో రెండుకు పెరిగిందని ఆయన తెలిపారు. రష్యా దాడి అనంతరం ఖర్కీవ్ స్థానిక అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. దాడి తర్వాత ధ్వంసమైన భవనాలను, మంటలను ఖర్కీవ్ అధికారులు, పోలీసులు ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ - రష్యా యుద్ధంలో వేలాది మంది పౌరులు బలైపోయారు.